రైలు ఢీకొట్టిందంటే ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. అలాంటిది తమిళనాడులో తల్లీకూతుళ్లు రైలు గుద్దినా.... క్షేమంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని కొరుక్కుపేటకు చెందిన స్వాతి అనే మహిళకు ఇద్దరు కవల పిల్లలు. ఇద్దరు కుమార్తెలు స్థానిక పాఠశాలలో ప్రీకేజీ చదువుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఇద్దరు పిల్లలను స్కూలు వద్ద దిగబెట్టేందుకు వారిని స్కూటీలో ఎక్కించుకుని బయల్దేరింది. ఈ క్రమంలో కొరుక్కుపేట రైల్వేగేటు వద్దకు వెళ్లినప్పుడు గేటు మూసివేశారు.

స్కూలుకు ఆలస్యమవుతుందని భావించిన స్వాతి కుమార్తెలతో స్కూటీని గేటు పక్కనున్న సందులో నడిపి పట్టాలను దాటుతుండగా... సూళ్లురుపేట-చెన్నై ఎలక్ట్రిక్ లోకల్ రైలు వేగంగా వచ్చింది.

దీంతో భయపడిపోయిన స్వాతి స్కూటీని విడిచిపెట్టి.. తన ఇద్దరు పిల్లలతో వేగంగా పట్టాలను దాటేయడంతో ప్రాణాలతో బయటపడింది. అయితే రైలు వేగం ధాటికి స్కూటీ నుజ్జనుజ్జయ్యింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.