ఒడిశాను టొమాటో ఫీవర్ వణికిస్తుంది. తాజాగా 26మంది పిల్లలు ఈ ఫ్లూ బారిన పడ్డారు. దీంతో ఆందోళన నెలకొంది. అయితే భయపడాల్సిన పనిలేదని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు.
భువనేశ్వర్ : ఒడిశాలో Tomato flu కలకలం రేపింది. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్(HFMD)గా పిలిచే ఈ వ్యాధి 26 మంది చిన్నారులకు సోకింది. అయితే ప్రస్తుతం వారికి ఎలాంటి అపాయం లేదని వైద్యులు పేర్కొన్నారు. టొమాటో ఫ్లూగా పేరుపొందిన వైరస్ పేగు సంబంధిత వ్యాధి కారణంగా సోకే అంటువ్యాధి. ముఖ్యంగా చిన్నారులకు ఇది వ్యాపిస్తుంది. వయోజనులకు దీన్ని తట్టుకునే రోగనిరోధక శక్తి ఉండటం వల్ల వారిపై ఈ వ్యాధి ప్రభావం చూపదు.
World Health Organizationప్రకారం ఈ వ్యాధి సోకిన చిన్నారులకు జ్వరం, నోట్లో పుండ్లు, చేతులు, కాళ్లు, పిరుదులపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి.
మొత్తం 36 మంది చిన్నారుల నమూనాలను పరీక్షించగా 26 మందికి ఈ వ్యాధి సోకినట్లు తేలిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. భువనేశ్వర్లోని రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వ్యాధి బారిన పడిన వారిలో 1-9 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లలే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వారందరినీ 5-7 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంచాలని సూచించారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ అంటువ్యాధి ప్రాణాంతకం కాదని వివరించారు. ఈ నెల ప్రారంభంలో కేరళలోని కొల్లాం జిల్లాలోనూ 80 మంది చిన్నారులు టమోటా ఫ్లూ బారిన పడిన విషయం తెలిసిందే.
కాగా టమోటో ఫ్లూ అనేది అరుదైన వైరస్. ఇది పిల్లలకు మాత్రమే సోకుతుంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులకు మాత్రమే సోకుతుంది. అయితే, ఇది ఏ రకమైన జ్వరమో ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే ఈ టొమాటో ఫ్లూ... వైరల్ ఫీవరా? లేక చికెన్ గునియా లేదా డెంగ్యూ జ్వరమా? అనే చర్చ ఇంకా కొనసాగుతోంది. కానీ ఈ సమస్య బారిన పడిన చాలా మంది పిల్లలకు చర్మం ఃపై దద్దుర్లు, చర్మం చికాకు పుట్టడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు దీని వల్ల శరీరంలోని కొన్ని భాగాల్లో బొబ్బలను కూడా గుర్తించారు.
టొమాటో ఫీవర్ పేరు ఎలా వచ్చింది అంటే.. బ్లిస్టర్ పేరుమీద టొమాటో ఫ్లూ అని పేరు పెట్టారు. ఎరుపు రంగులో ఉండే బొబ్బలు చక్రాల టమాటాల మాదిరిగానే కనిపించడం వల్ల ఈ వ్యాధికి టొమాటో ఫీవర్ అని పేరు పెట్టారు. ఈ వ్యాధి ప్రస్తుతం కేరళలోని కొల్లంలో పెరిగిపోతూనే ఉంది. అయితే ఇది అతి త్వరలోనే కేరళలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ రకమైన వ్యాధిని హ్యాండ్, ఫుట్ మౌత్ డిసీజ్ అని కూడా అంటారు.
ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే పిల్లలకు నీళ్లు బాగా తాగించాలి. ముఖ్యంగా నీళ్లను బాగా మరిగించి.. చల్లారిన తర్వాత తాగిస్తే మంచిది. బొబ్బలు లేదా దద్దుర్ల వల్ల పిల్లల చర్మంపై ఎలాంటి గీతలు పడవు. ఈ సమయంలో పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. ఫ్లూ బారిన పడినవారు వాడే పాత్రలు దుస్తులు ఇతర వస్తువులు తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి.
