మహిళా రిజర్వేషన్ల కోసం జనాభా లెక్కలు, డీలిమిటేషన్ అవసరమే లేదు.. ఈరోజు నుంచే అమలు చేయొచ్చు - రాహుల్ గాంధీ
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసేందుకు జనాభా లెక్కలు, డీలిమిటేషన్ వరకు ఆగాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటికప్పుడు ఈ బిల్లును అమలు చేయడం పెద్ద సంక్లిష్టమైన విషయం కాదని తెలిపారు. పదేళ్ల తరువాత ఈ బిల్లు అమలవుతుందో లేదో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

చట్ట సభల్లో మహిళకు రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీసుకొచ్చిన ‘నారీ శక్తి వందన్ అధినీయం’ లోక్ సభలో, రాజ్యసభలో దాదాపుగా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే అది చట్టంగా మారనుంది. అయితే రిజర్వేషన్లు అమలు చేయడానికి జానాభా లెక్కలు, డిలీమిటేషన్ అవసరమని కేంద్రం పేర్కొంది. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన ఒక రోజు తరువాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు.
చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు జనాభా గణన, డీలిమిటేషన్ అవసరం లేదని అన్నారు. చేయాలనుకుంటే ఈరోజు నుంచి చట్టాన్ని అమలులోకి తీసుకురావచ్చని తెలిపారు. శుక్రవారం ఆయన పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కావాలనే ఈ రిజర్వేషన్లను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు.
‘‘మహిళా రిజర్వేషన్లు మంచి విషయం. కానీ ఈ బిల్లులో మేము రెండు ఫుట్ నోట్ లను కనుగొన్నాము. అందులో ఒకటి ఈ రిజర్వేషన్ల అమలుకు ముందు జనాభా గణన చేయవలసి ఉంటుంది. రెండోది డీలిమిటేషన్. ఇవి జరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఈ రోజే ఇవ్వొచ్చు. ఇది సంక్లిష్టమైన విషయం కాదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
మహిళా రిజర్వేషన్ల విషయాన్ని ప్రభుత్వం దేశం ముందు ఉంచిందని, అయితే దీని అమలుకు పదేళ్ల సమయం పడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. అప్పటికి అది అమలవుతుందో లేదో అనేది ఎవరికీ తెలియదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఇప్పుడు తీసుకొచ్చి ఓబీసీ జనాభా లెక్కల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓబీసీల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతీ రోజూ ఓబీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నార తనకు అర్థం కావడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. క్యాబినెట్ కార్యదర్శి, కార్యదర్శులు 90 మందిలో ముగ్గురు మాత్రమే ఓబీసీ వర్గానికి చెందిన వారు ఉండటం ఏమిటని అన్నారు. ప్రధాని ఓబీసీల కోసం ఏమి చేశారని ప్రశ్నించారు. కాగా.. 2010లో యూపీఏ తీసుకొచ్చిన బిల్లు ప్రకారం ఓబీసీ కోటా కల్పించలేదని చింతిస్తున్నారా అని ఆయనను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన అంగీకరిస్తూ.. 100 శాతం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అది అప్పుడే జరగాల్సిందని తెలిపారు. కానీ తాము దానిని కచ్చితంగా పూర్తి చేస్తామని అన్నారు.