హిజాబ్ వివాదంపై ఈ రోజు కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్లు వాదిస్తున్నట్టుగా హిజాబ్ ధరించడం ఆర్టికల్ 25 కిందకు రాదని, అది 19(1)(ఏ) కిందకు వస్తుందని కర్ణాటక తరఫు అడ్వకేట్ జనరల్ తెలిపారు. మన దేశంలో హిజాబ్ ధరించడంపై నిషేధం లేదని అన్నారు. అయితే, ఆయా సంస్థలు అంతర్గతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉన్నదని తెలిపారు. 

బెంగళూరు: కర్ణాకట హైకోర్టు(Karnataka High Court)లో ఈ రోజు హిజాబ్ వివాదం(Hijab Row)పై రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు(Arguments) వినిపించింది. పిటిషనర్లు వాదిస్తున్నట్టు హిజాబ్ ధరించడం రాజ్యాంగం(Constitution)లోని అధికరణం 25(Article 25) కిందకు రాదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవద్డీ స్పష్టం చేశారు. కానీ, 19(1)(ఏ) కిందకు వస్తుందని తెలిపారు. మన దేశంలో హిజాబ్ ధరించడంపై నిషేధం లేదని అన్నారు. కానీ, ఆయా సంస్థలు వాటి అవసరాల రీత్యా హిజాబ్ ధారణపై ఆంక్షలు విధించవచ్చునని చెప్పారు. కర్ణాటక విద్యా సంస్థల్లోనూ హిజాబ్ ధరించడంపై నిషేధం లేదని తెలిపారు. అయితే, క్లాసు రూమ్‌లలో.. బోధన జరిగేటప్పుడు మాత్రమే హిజాబ్ ధరించడంపై ఆంక్షలు ఉన్నాయని పేర్కొన్నారు.

మన దేశంలో హిజాబ్ ధరించడంపై పూర్తిగా నిషేధం లేదని వివరించారు. అయితే, ఇస్లాం మతంలో హిజాబ్ ధరించడం తప్పనిసరేమీ కాదనీ పేర్కొన్నారు. ఇందుకు ఫ్రాన్స్ దేశాన్ని ఉదహరించారు. ఫ్రాన్స్‌లో హిజాబ్ ధరించడంపై పూర్తిగా నిషేధం ఉన్నదని వివరించారు. అంతమాత్రానా.. ఆ దేశంలో ఇస్లాం మతం లేదని కాదు అని వాదించారు. మన దేశంలో అలా కాదని, ఇక్కడ హిజాబ్ ధరించడంపై నిషేధం లేదని తెలిపారు. కానీ, ఆయా సంస్థల అంతర్గత నిబంధనలు, డిసిప్లీన్ ఆధారంగా వాటిపై ఆంక్షలు ఉండటానికి అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఒక వేళ హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి అని భావిస్తే.. అది వ్యక్తిగత స్వేచ్ఛనూ హరించడానికి దోహదపడుతుందని అన్నారు. హిజాబ్ తప్పనిసరి మత ఆచారం అని ప్రకటిస్తే.. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వివరించారు. ఆ కమ్యూనిటీలోని ప్రతి ఒక్కరూ హిజాబ్ ధరించి తీరాలనే నిబంధనను ఇచ్చినట్టు అవుతుందని, లేదంటే.. హిజాబ్ ధరించకుండా తమ స్వేచ్ఛను కాపాడుకోవాలనుకునే వారు ఆ కమ్యూనిటీ నుంచి బహిష్కృతులుగా కూడా మిగలవచ్చని హెచ్చరించారు. కాగా, ఇక్కడ పిటిషనర్ల వాదనం మొత్తం కూడా హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి చేయాలన్నట్టుగానే ఉన్నదని, ఆ ఆదేశం రాజ్యాంగం మౌలిక స్వభావాన్ని విరుద్ధమైనదని పేర్కొన్నారు.

పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్‌ సంబంధ నిబంధనలపై లోతుగా ఆలోచించాల్సిన పని లేదని ఆయన వాదించారు. కర్ణాటక ఎడ్యుకేషన్ యాక్ట్ పీఠికలోనే సెక్యూలర్ ఔట్‌లుక్ అని ఉన్నదని ఆయన తెలిపారు. క్యాంపస్‌లో హిజాబ్ ధరించడంపై ఆంక్షలు లేవని వివరించారు. అయితే, బోధనలు జరుగుతుండగా, అలాగే, తరగతి గదుల్లో హిజాబ్ ధరించడంపై ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నిబంధనే అన్ని మతాలకూ వర్తిస్తుందని తెలిపారు.

కాగా, మతపరమైన అంశాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని, ఆ మత ఆచారాల వల్ల ప్రజా ఆరోగ్య, భద్రత, లేదా ఇతర ప్రధాన సమస్యలకు ఆజ్యం పోస్తేనే వాటిపై చర్యలు తీసుకోవడానికి రాజ్యాంగం అవకాశం ఇస్తున్నదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. కాగా, హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పక ఆచరించే విధానం అని ఇంకొకరు వాదించారు. 

ఈ వాదనలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితు రాజ్ అవస్థీ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం విన్నది. విచారణను రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.