భారత ప్రధాని నరేంద్రమోదీ.. సైనికుల మధ్య దీపావళి సంబరాలను జరుపుకున్నారు. దీపావళి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని  జైసల్మేర్‌లో పర్యటించారు. సైనికుల మధ్యే దీపావళి పండగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. హిమాలయ శిఖరాల్లో ఉన్నా... ఎడారిలో ఉన్నా, దట్టమైన అడువులు, లోతైన సముద్రాలు... ఇలా ఎక్కడ ఉన్నా శౌర్యంతో జవాన్లు పోరాడతారని, ఎదురయ్యే ప్రతి సవాల్‌లోనూ విజయం సాధిస్తూనే ఉంటున్నారని సైనికులపై ప్రశంసల వర్షం కురిపించారు.

దేశ సరిహద్దుల వెంబడి ఉన్న అనేక పోస్టుల్లో ఎవరికైనా ఎక్కువ కాలం గుర్తుండే పోస్ట్ ‘లోంగేవాలా పోస్ట్’ అని, తరతరాలుగా ఈ లోంగేవాలా పోస్ట్ అందరికీ గుర్తుండి పోతుందని మోదీ పేర్కొన్నారు. ఇక్కడే దాయాది పాకిస్తాన్‌కు భారత జవాన్లు దీటైన సమాధానం చెప్పారని, శత్రువులెవరూ దేశ జవాన్ల ముందు నిలబడలేరన్న గట్టి సంకేతాలను కూడా ఇక్కడి నుంచే పంపారని మోదీ గుర్తు చేశారు.  ప్రతి భారతీయుడి గుండెల్లో శౌర్యాన్ని నింపే విధంగా సైనికులు ఈ పోస్ట్‌లో తమ పరాక్రమాన్ని చూపారని మోదీ ప్రశంసించారు. 

‘‘ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తల్లో దీపావళి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని సియాచిన్ ప్రాంతంలో పర్యటించాను. ఆ సమయంలో అందరూ నిబిడాశ్చర్యంలో మునిగిపోయారు. అయినా నా గురించి మీకు తెలుసు. ప్రతి పర్వదినాన్నీ నా సన్నిహితులతో జరుపుకుంటానని మీకు తెలుసు. ఈ సంవత్సరం కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను.’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.