మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడంలో సహాయం చేయనందుకు తనను దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆయన లేఖ రాశారు. 

మహారాష్ట్ర (maharasta) ప్రభుత్వాన్ని కూల్చివేయ‌డంలో సహాయం చేయ‌నందుకు ఈడీ (ED) త‌న‌ను వేధిస్తోందని శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ (Sanjay Raut) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ మేర‌కు ఉప‌రాష్ట్ర‌పతి వెంక‌య్య నాయుడి (venkaiah naidu)కి ఆయ‌న లేఖ రాశారు. ఈడీ (ED) ఇతర దర్యాప్తు సంస్థ అధికారులు ఇప్పుడు రాజకీయ యజమానులకు తోలుబొమ్మలుగా మారారు అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలను తీసుకువ‌చ్చేలా ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోతే జైలు శిక్ష విధిస్తామని బెదిరించారని ఆరోపించారు. 

‘‘ సుమారు ఒక నెల క్రితం కొంతమంది వ్యక్తులు నన్ను సంప్రదించారు. మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడంలో వారికి సహాయం చేయలని చెప్పారు. రాష్ట్రాన్ని మధ్యంతర ఎన్నికలకు తీసుకురావాలని, ఆ ప్ర‌యత్నాల్లో నేను కీల‌కంగా ఉండాల‌ని వారు కోరారు. నేను దానికి నిరాకరించాను. నా తిరస్కరణకు నేను భారీ మూల్యం చెల్లించుకోవలసి వారు హెచ్చ‌రించారు. ఓ మాజీ కేంద్ర మంత్రికి ప‌ట్టిన గ‌తే నాకు ప‌డుతుంద‌ని తెలిపారు. నేనే కాకుండా మహారాష్ట్ర కేబినెట్‌లోని మరో ఇద్దరు సీనియర్ మంత్రులతో పాటు మ‌రో ఇద్దరు సీనియర్ నేతలను కూడా పీఎంఎల్‌ఏ చట్టం కింద కటకటాల వెనక్కి పంపుతామని చెప్పారు. ఇది మధ్యంతర కాలానికి దారి తీస్తుందని హెచ్చరించింది. రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా కటకటాల వెనుకే ఉన్న స‌మ‌యంలో మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతాయి’’ అని వారు తెలిపారని అన్నారు. 

తన కుటుంబానికి 17 ఏళ్ల క్రితం అలీబాగ్‌ (ali bhagh)లో కేవలం 1 ఎకరం భూమి ఉందని సంజయ్ రౌత్ చెప్పారు. అయితే ఆ భూమిని విక్రయించిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులను తనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇవ్వాలని ED, ఇతర ఏజెన్సీలు బెదిరిస్తున్నాయని ఆయ‌న ఆరోపించారు. ‘‘ 2012-2013లో నాకు, నా కుటుంబానికి ఇదే విధమైన ఓ చిన్న స్థ‌లాన్ని విక్రయించిన ఇతర వ్యక్తులకు కూడా ఇదే జ‌రుగుతోంది. ఏజెన్సీ సంస్థ‌ల సిబ్బంది వారికి ఫోన్ చేసి జైలుకు పంపిస్తామ‌ని, వారి వ్యక్తిగత ఆస్తులను అటాచ్ చేస్తామని బెదిరించారు. ఈ ఆస్తులన్నీ పబ్లిక్ డొమైన్‌ (public domain)లో ఉన్నాయి. రాజ్యసభకు నా నామినేషన్ దాఖ‌లు చేసిన ప‌త్రాల్లో, అఫిడ‌విట్ లో ఈ వివ‌రాలు అన్నీ ఉన్నాయి. ఈ విష‌యంలో ఇప్ప‌టి వర‌కు న‌న్ను ఎలాంటి ప్రశ్న అడగలేదు. అయితే అకస్మాత్తుగా ఇప్పుడు ప్రతిదీ ఈడీ, ఇత‌ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ఇదే పెద్ద ఆందోళ‌నక‌ర అంశంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం సంపాదించిన ఆస్తులపై విచార‌ణ జ‌రిపే హ‌క్కు ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు లేదు’’ అని ఆయన చెప్పారు. 

విచారణ సంస్థలు ఇప్పటివరకు 28 మందిని అనవసరంగా నిర్బంధించారని, నాకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌లు ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని సంజయ్ రౌత్ అన్నారు. 2003లో అమల్లోకి వచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టాన్ని ఎత్తి చూపుతూ, దశాబ్దాల నాటి లావాదేవీల కోసం ఈడీ, ఇతర కేంద్ర సంస్థలు బీజేపీ రాజకీయ ప్రత్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. 2003 తర్వాత లావాదేవీలకు మాత్రమే చట్టం వర్తిస్తుందని అన్నారు. గత ఏడాది జరిగిన తన కుమార్తె వివాహ వేడుకకు సంబంధించిన డెకరేటర్లు, ఇతర వ్యక్తులను విచారణ సంస్థలు పిలిపించి వారికి తను రూ. 50 లక్షలు నగదు ఇచ్చినట్టు చెప్పాల‌ని బెదిరింపులకు గురిచేస్తున్నాయని అన్నారు. 

‘‘ మహారాష్ట్రలో శివసేన (shivasena), బీజేపీ (bjp)తో విడిపోయినప్పటీ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, కొన్ని ఇత‌ర ఏజెన్సీల‌ను శివసేన నాయకుల కోసం ఉప‌యోగిస్తున్నారు. ఆ సిబ్బంది మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నేతలతో పాటు వారి బంధువులు, స్నేహితులు, పరిచయస్తులను వేధిస్తున్నారు’’ అని ఆయన అన్నారు. తాను ఎవరికీ భయపడబోనని, తలవంచనని, నిజాలు చెబుతూనే ఉంటానని తెలిపారు. ‘‘ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేస్తున్న ఈ ప్రయత్నాలను ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా నేను భావిస్తున్నాను ’’ అని ఆయన చెప్పారు.