న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సరికొత్త కార్యక్రమానికి నాంది పలికారు.  ప్రతీ ఒక్కరూ హిందీ నేర్చుకోవాల్సిందేనంటూ చెప్పుకొచ్చారు. హిందీ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా భారత దేశాన్ని ఏకతాటి పైకి తేగల సత్తా హిందీ భాషకి మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. 

ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశానికి తనదైన గుర్తింపు ఉండాలంటే అందరికీ ఓ భాష తెలిసి ఉండడం అవసరమన్నారు.  చాలా దేశాల్లో వారి మాతృభాషలు కనుమరుగయ్యాయి. మాతృభాషను విమర్శిస్తే ఆ దేశ ఉనికికే ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉందన్నారు. భాషను వదిలేస్తే సంస్కృతిని పరిరక్షించుకోలేమని చెప్పుకొచ్చారు. 

భిన్న భాషలు, మాండలికాలే భారతదేశానికి బలం అంటూ చెప్పుకొచ్చారు. ప్రతీ భాషకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. కానీ దేశానికి ఓ భాష అంటూ ఉండాలని అది హిందీ అయితే బాగుంటుందన్నారు. 

ప్రస్తుత కాలంలో దేశాన్ని ఐక్యంగా ఉంచగల భాష ఏదైనా ఉందంటే అది అత్యధికంగా మాట్లాడే హిందీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. అందుకే స్వాతంత్య్ర సమరయోధులు హిందీని రాజభాషగా ముందుకు తీసుకువచ్చినట్లు అమిత్ షా చెప్పుకొచ్చారు. 

భారత్‌లోని ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలన్నింటా ప్రతి పిల్లాడికీ హిందీ బోధించడం జరుగుతుందని అమిత్ షా గుర్తు చేశారు. ప్రజలంతా తరచూ హిందీ మాట్లాడేందుకు ప్రయత్నం చేయాలనీ కోరారు. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కలలుగన్న ఒకే దేశం, ఒకే భాష నినాదాన్ని నిజం చేయాలంటే అంతా హిందీ నేర్చుకోవాలని కోరారు. 

బలవంతంగా రుద్దితే వ్యతిరేకిస్తాం: షాకు స్టాలిన్ కౌంటర్

ప్రతీ ఒక్కరూ హిందీ నేర్చుకోవాలని, దేశమంతా ఒకే భాష ఉండాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటనపై డీఎంకే చీఫ్ స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించొద్దన్నారు. 

ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే తీవ్రంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి ప్రకటనలు దేశ ఐక్యతను దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. అమిత్ షా తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.