సైన్యం కట్టుదిట్టంగా వ్యవహరిస్తుండటంతో పాటు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తుండటంతో గత కొద్దినెలలుగా జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల హల్ చల్ తగ్గింది. అంతా ప్రశాంతంగా వున్న నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు, ఏకంగా భద్రతా సిబ్బందినే టార్గెట్ చేశారు.

శుక్రవారం పట్టపగలు, నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కాల్పులకు తెగ బడ్డారు. ఓ దుకాణం వద్ద నిలబడి ఉన్న భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపాడో ఓ ఉగ్రవాది. శ్రీనగర్‌ భగత్‌ బర్జుల్లా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బర్జుల్లాలోని ఓ దుకాణం వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఒకరు నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో ఎక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చిన ఓ ఉగ్రవాది తన వద్ద ఉన్న ఏకే-47 మిషన్ గన్‌తో కాల్పులకు తెగ బడ్డాడు.

ఊహించని ఈ ఘటనతో స్థానికులు త్రీవ భయందోళనకు గురయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాది అక్కడ నుంచి అత్యంత వేగంగా పరిగెత్తాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఉగ్రవాది కాల్పుల జరిపిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమరాలో రికార్డయ్యాయి.