Asianet News TeluguAsianet News Telugu

టీచర్స్ డే స్పెషల్ : ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన రాధాకృష్ణన్

గురుపూజోత్సవం అంటే వెంటనే గుర్తొచ్చేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. తను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించడమే కాకుండా స్వయంకృషితో పైకి ఎదిగి... ఉపాధ్యాయ వృత్తికే రాధాకృష్ణన్ మకుటంలా నిలిచారు. ఏ పనిలోైనా నిబద్ధత కలిగి ఉండాలని ఆయన జీవితం మనకు పాఠం చెబుతుంది.

teachers day Special story on sarvepalli radhakrishnan
Author
New Delhi, First Published Sep 5, 2019, 12:17 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మానవుని జీవన ప్రస్థానంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత వహించేది గురువులే. గురువులేని మనిషి మంచి మార్గాన తన ప్రయాణం సాగించలేడు. అమ్మ నుంచి మంచి మాటలు నేర్పిస్తే.. ఉత్తమ పౌరులుగా ఉపాధ్యాయుడు తీర్చిదిద్దుతాడు. గురువంటే  కేవలం విద్య నేర్పించే వాడుగానే భారతీయ సమాజం చూడలేదు. విద్యార్ధికి లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ మార్గదర్శిగా నిలిచేవాడు ఉపాధ్యాయుడే.

భారతీయ పురాణేతిహాసాల నుంచి గురుశిష్య పరంపరకు భారతదేశం అత్యంత ప్రముఖ స్థానాన్ని ఇచ్చింది. శ్రీరాముడు-వశిష్టుడు, శ్రీకృష్ణుడు-సాందీపుడు ఆ విధంగా ప్రఖ్యాతి వహించారు. ఆధునిక భారతంలో గురుశిష్య సంబంధం అనురాగం, అనుబంధంతో కొనసాగితే.. ఇప్పుడు స్నేహబంధంలా అల్లుకుపోతోంది. అటువంటి గురువులను ఏడాదిలో ఒక్కసారైనా ప్రస్తావించుకునే రోజే ఉపాధ్యాయ దినోత్సవం.

మన తరంలో గురుపూజోత్సవం అంటే వెంటనే గుర్తొచ్చేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. తను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించడమే కాకుండా స్వయంకృషితో పైకి ఎదిగి... ఉపాధ్యాయ వృత్తికే రాధాకృష్ణన్ మకుటంలా నిలిచారు. ఏ పనిలోైనా నిబద్ధత కలిగి ఉండాలని ఆయన జీవితం మనకు పాఠం చెబుతుంది. 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుత్తణిలో వీరాస్వామయ్య, సీతమ్మ దంపతులకు ఆయన జన్మించారు.

బాల్యం నుంచే అఖండమైన రాధాకృష్ణన్ మేథాశక్తికి ఉపాధ్యాయులు ముగ్థులయ్యేవారు. తత్త్వ శాస్త్రం, మనస్తత్వశాస్త్రంపై బాగా అధ్యయనం చేసిన ఆయన చిన్న వయసులోనే ఇచ్చిన ఉపన్యాసాలు పలువురిని ఆకట్టుకునేవి. ఇక 16 ఏళ్ల వయసులోనే శివకామేశ్వరితో రాధాకృష్ణన్ వివాహం జరిగింది. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుంచి ఎం.ఏ పట్టా పొందిన ఆయన.. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు.

అనంతర కాలంలో తత్త్వ శాస్త్రంలో రాథాకృష్ణన్ ప్రతిభను తెలుసుకున్న మైసూరు విశ్వవిద్యాలయం ఆయను ప్రోఫెసర్‌గా ఆహ్వానించింది. కంచులాంటి కంఠంతో రాధాకృష్ణన్ చేసే ఉపన్యాసాలు విద్యార్ధులను ఎంతగానో ఆకట్టుకునేవి. దీంతో వారు కదలకుండా, బెంచ్‌లకి అతుక్కుపోయి మరి శ్రద్ధగా వినేవారు. రాధాకృష్ణన్ ప్రతిభను గుర్తించిన డాక్టర్. అశుతోష్ ముఖర్జీ , రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తా విశ్వవిద్యాలయానికి రావాల్సిందిగా కోరారు.

దీంతో వారి ఆహ్వానం మేరకు రాధాకృష్ణన్ కోల్‌కతా వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అయితే మైసూరు విశ్వవిద్యాలయం యాజమాన్యం, విద్యార్ధులు ఆ వార్తను జీర్ణించుకోలేకపోయారు. గురువుపై అభిమానంతో వారు బండికి కంట్టిన గుర్రాలను తీసివేసి.. రైల్వేస్టేషన్ వరకు విద్యార్ధులే బండిని లాక్కొని వెళ్లారు. మార్గమధ్యంలో పురప్రముఖులు, ప్రజలు రాధాకృష్ణన్‌కు వీడ్కోలు పలికారు.

కోల్‌కతా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు భారతీయ తత్త్వశాస్త్రంపై ఆయన రాసిన గ్రంథం.. విదేశీ పండితుల ప్రశంసలు అందుకుంది. మీరు ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ తీసుకుని వుంటే మీకు ఇంకామరింత గొప్ప పేరు వచ్చేది" అనిఒక మిత్రుడు అనగా, బదులుగా, డా. రాధాకృష్ణన్, "నేను ఆక్స్ ఫర్డ్ వెళ్తే, అధ్యాపకుడిగా మాత్రమే వెళ్తాను. కాని విద్యార్ధిగా మాత్రం వెళ్ళను" అన్నాడు. ఆయనకు అంత దేశభక్తి రాధాకృష్ణన్‌ది.

అయితే పలువురి ఆహ్వానం మేరకు విదేశాల్లో ఆయన పలు ఉపన్యాసాలు ఇచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైఎస్ ఛాన్స్‌లర్‌గా పనిచేయడం తెలుగు వారందరికీ గర్వకారణం. స్వాతంత్య్రానంతరం ప్రధాని నెహ్రూ కోరిక మేరకు భారత తొలి ఉప రాష్ట్రపతిగా 1952-62 వరకు పనిచేశారు. అనంతరం రాధాకృష్ణన్ దేశ రెండవ రాష్ట్రపతిగా సేవలందించారు. ఒకసారి ఆయన పుట్టినరోజున కొందరు రాధాకృష్ణన్ గారిని సన్మానించేందుకు వచ్చారు.

ఈ సమయంలో ఆయన నా జన్మదినాన్ని ' ఉపాధ్యాయ దినోత్సవంగా' ప్రకటించి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తే నన్ను సంతోష పెట్టినట్లే, నాకు సన్మానం చేసినట్లుగా భావిస్తానని చెప్పారు. దీంతో భారత ప్రభుత్వం 1962 నుంచి ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ‘‘ఉపాధ్యాయ దినోత్సవం’’గా ప్రకటించింది. ఈ సందర్భంగా పాఠశాలలకు ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి రాష్ట్రపతి అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

కాలం ఎంతగా మారినా.. ఉపాధ్యాయుడి పాత్ర అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ గురుతరమైనదే. అలాంటి వృత్తికి తలమానికంగా నిలిచిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్రపతిగా అత్యున్నత శిఖరాలకు చేరుకున్న రాధాకృష్ణన్ జీవితం ఆదర్శప్రాయమైనది. 

Follow Us:
Download App:
  • android
  • ios