తమిళనాడులో దారుణం జరిగింది. అనారోగ్యంతో వున్న ఓ వ్యక్తిని సొంత కుటుంబసభ్యులు శవాలను భద్రపరిచే ఫ్రిజ్‌లో పెట్టి చంపేందుకు ప్రయత్నించారు.

వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లాలో 74 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడని చెప్పి బాధితుని సోదరుడు ఒక ఏజెన్సీ నుంచి శవాలను భద్రపరిచే ఫ్రిజ్‌ను సోమవారం రాత్రి తీసుకొచ్చి అందులో అతనిని పడుకోబెట్టారు.

దీంతో ఏజెన్సీకి చెందని ఎగ్జిక్యూటివ్ ఫ్రీజ్‌ను తిరిగి తీసుకోవడానికి మంగళవారం వచ్చాడు. ఈ సమయంలో ఆ వృద్ధుడు బతికే వున్నాడని గమనించిన ఆ ఎగ్జిక్యూటివ్ అలారం మోగించి అతనిని బ్రతికించడానికి ప్రయత్నించేందుకు ఆసుపత్రికి తరలించారు.

ఆ వృద్ధుడు బాక్స్‌లో ఊపిరి తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బందిపడుతున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. బాధితుడిని బాలసుబ్రమణ్య కుమార్‌గా గుర్తించారు. ఆ వృద్ధుడి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యాడు.

అయితే అతను చనిపోతాడని భావించిన వృద్ధుడు సోదరుడు మృతదేహం కోసం ఫ్రీజ్ బాక్స్ తీసుకొచ్చాడు. అంత్యక్రియల కోసం ఉచితంగా వాహనాలను అందజేసే దీవలింగం అనే న్యాయవాది ఈ ఘటన గురించి తెలుసుకుని వృద్ధుడికి ఇంటికి చేరుకున్నాడు.

వృద్ధుడిని రాత్రంతా ఆ మార్చురీ బాక్స్‌లోనే వుంచిన కుటుంబసభ్యులు.. అతను ఎప్పుడు చనిపోతాడా అని ఎదురుచూసినట్లుగా దీనలింగం తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో స్టోర్ కీపర్‌గా పనిచేసి రిటైర్ అయిన బాధితుడు తన సోదరుడు, మేనకోడలిలో కలిసి నివసిస్తున్నాడు.