చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది. ప్రభుత్వ భూములను అక్రమంగా విక్రయిస్తున్నారని కథనాలు రాసినందుకు గాను ఓ యువ జర్నలిస్టును అత్యంత దారుణంగా  చంపారు.

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలోని కుంద్రత్తూరులో  మోజెస్ అనే యువ జర్నలిస్టును అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. మోజెస్ వయస్సు 26 ఏళ్లు.

ప్రభుత్వ భూమిని కొందరు విక్రయిస్తున్నారనే విషయమై కొంత కాలంగా మోజెస్ వార్తలు రాస్తున్నాడు.ఇది గిట్టనివారు అతనిపై కక్షగట్టారు. మోజెస్ ను కత్తులతో దాడి చేశారు. మోజెస్ శరీరంపై 18 కత్తిపోట్లున్నాయని వైద్యులు తెలిపారు. 

మలై తమిజఘం దినపత్రికలో మోజెస్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు.  మోజెస్ హత్య కేసులో ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మోజెస్ తండ్రి కూడ జర్నలిస్టు. 

మోజెస్ ఇంట్లో ఉండగా ఆయన్ను బయటకు పిలిచి కత్తులతో పొడిచి చంపినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.జర్నిస్టులపై దాడులకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని జర్నలిస్టు సంఘాలు కోరుతున్నాయి.