భార్య భర్తలు కొన్ని సంవత్సరాలపాటు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఇక కలిసి ఉండటం కష్టమని భావించి విడిపోయారు. అయితే... తన నుంచి దూరమైన భర్తపై ఆమె కక్ష పెంచుకుంది. ఎలాగైనా అతనిని సాధించాలని పగ పెంచుకుంది. అందుకోసం మైనర్ అయిన తన బాలికను పావుగా వాడుకుంది. తన కూతురిపై ఆమె తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడని.. దీంతో బాలిక గర్భం దాల్చిందంటూ పోలీస్ కేసు పెట్టింది. అయితే... అది పచ్చి అబద్ధం అని తేలడంతో... అదే కేసు ఆమె మెడకు చుట్టుకుంది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... చెన్నైకి చెందిన 11ఏళ్ల బాలికపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడని..దీంతో బాలిక గర్భం దాల్చిందని  చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె భర్తపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకి పంపించారు.

ఏ తప్పు చేయని ఆ వ్యక్తి తనపై పెట్టిన కేసును కొట్టేయాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. కాగా... అందరూ బాలిక తండ్రికి శిక్ష వేయడం ఖాయమని భావించిన సమయంలో కేసు కీలక మలుపు తిరిగింది.

బాలిక తల్లి చేసి ఆరోపణలు అన్నీ తప్పు అని తేలింది. ఈ విషయాన్ని బాలికే స్వయంగా వెల్లడించడం గమనార్హం. భర్తపై కక్ష సాధించడానికే ఆమె ఆ ఆరోపణలు చేశారని కోర్టుకు స్పష్టంగా తెలిసిపోయింది. భర్త మీద కోపంతో కన్నకూతురిని ఇలా బలిచేయడం దారుణమని కోర్టు బావించింది. పిటిషనర్ పై పోక్సో చట్టం తక్షణం రద్దు చేయడంతోపాటు... ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసిన మహిళపై అదే చట్టం కింద కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.