ముక్కు పచ్చలారని కన్న బిడ్డ పట్ల ఓ కసాయి తండ్రి దారుణంగా ప్రవర్తించాడు.  మూడు నెలల చిన్నారిని ముక్కలుగా నరికేశాడు. ఈ దారుణ సంఘటన తమతిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తండారంపట్టులో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా చిన్నారిని ఆ తండ్రి నరికినట్లు సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెళితే... కంబంపట్టు గ్రామానికి చెందిన కార్తికేయన్‌ (30), రాజేశ్వరి దంపతులకు మూడు నెలల చిన్నారి వుంది. చిల్లర దుకాణం నడుపుతున్న కార్తికేయన్‌  ఇంట్లో భార్యాబిడ్డలతో నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి బిడ్డ కేకలు విన్న తల్లి లేచి చూడగా భర్త బిడ్డను ముక్కలు ముక్కలుగా నరకడం చూసి భయాందోళనకు గురై బిగ్గరగా కేకలు వేసింది. 

ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోవడం గమనించిన కార్తికేయన్‌ పరారయ్యేందుకు యత్నించాడు. అయితే స్థానికులు అతడిని పట్టుకుని వానాపురం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగా కార్తికేయన్‌ కొద్ది రోజులుగా మనస్థాపానికి గురైనట్లు తెలిసింది. పోలీసులు కార్తికేయన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.