చెన్నై: తమిళనాడు సీఎం పళనిస్వామి తల్లి తవుసాయమ్మళ్ మంగళవారం నాడు తెల్లవారుజామున  మరణించారు. ఆమె వయస్సు 93 ఏళ్లు.

వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య కారణాలతో ఆమె కొంత కాలంగా బాధపడుతున్నారు. దీంతో ఆమెకు ఇంటి వద్ద వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే శుక్రవారం నాడు ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆమెను శుక్రవారంనాడు  సేలంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం నాడు తెల్లవారుజామున మరణించారు. 

ఇవాళ దక్షిణాది జిల్లాల పర్యటనను ముఖ్యమంత్రి పళనిస్వామి రద్దు చేసుకొన్నారు.  తుత్తూకూడి,కన్యాకుమారి, విరుధనగర్ జిల్లాల్లో సమీక్ష సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. అయితే తల్లి మరణించిన విషయాన్ని తెలుసుకొన్న ఆయన వెంటనే ఈ కార్యక్రమాలను రద్దు చేసుకొని రోడ్డు మార్గంలో ఆయన సేలంకు చేరుకొన్నారు.

మంత్రులు కేపీ అంబలగన్, కేఏ సెంగొట్టయన్, ఎస్పీ వేలుమణి, పి. తంగమణి, కేసీ, కరుప్పన్నన్, ఉద్దుమలై, ఆర్. రాధాకృష్ణన్, డాక్టర్ వి. సరోజ, ఆర్. విజయ భాస్కర్, సేలం జిల్లా కలెక్టర్ ఎస్ఏ రమణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు  తవుసాయమ్మళ్ పార్థీవదేహం వద్ద నివాళులర్పించారు.

ఇవాళ ఉదయం సేలం స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పెద్ద ఎత్తున జనం గుమికూడకుండా ఉండేందుకు గాను ఉదయమే అంత్యక్రియలు నిర్వహించినట్టుగా అధికారులు చెప్పారు.

ఇవాళ మధ్యాహ్నానికి డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంతో పాటు మరికొందరు పార్టీ నేతలు, మంత్రులు కూడ సీఎంను పరామర్శించేందుకు రానున్నారు.

డీఎంకె చీఫ్ స్టాలిన్, పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్, ఎండిఎంకే జనరల్ సెక్రటరీ వైకో, సినీ నటుడు రజనీకాంత్ తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేసి పరామర్శించారు.