26 వారాల గర్భం తొలగింపు అభ్యర్థన.. తిరస్కరించిన సుప్రీం కోర్టు..
26 వారాల గర్భాన్ని తొలగించాలన్న ఓ వివాహిత అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

న్యూఢిల్లీ: 26 వారాల గర్భాన్ని తొలగించాలన్న ఓ వివాహిత అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇచ్చిన మెడికల్ రిపోర్టు ఆధారంగా బాలుడిలో ఎలాంటి అసాధారణతలు లేవని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. మహిళ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని.. గర్భం దాల్చిన ఈ దశలో అబార్షన్ అభ్యర్థనను కోర్టు ఆమోదించలేదని తెలిపింది.
‘‘గర్భధారణ 26 వారాల 5 రోజులు. అందువల్ల, గర్భం రద్దును అనుమతించడం ఎంటీపీ చట్టంలోని సెక్షన్లు 3, 5ని ఉల్లంఘిస్తుంది. ఈ విషయంలో తల్లికి తక్షణ ముప్పు లేదు. ఇది పిండం అసాధారణతకు సంబంధించినది కాదు’’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. తాము గుండె చప్పుడు ఆపలేమని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. మహిళ ఎయిమ్స్‌లో చికిత్స పొందవచ్చని సుప్రీం ధర్మాసనం తెలిపింది. వైద్య ఖర్చులన్నీ రాష్ట్రమే భరించాలని ఆదేశించింది.
ఈ కేసు విషయానికి వస్తే.. ఓ మహిళకు తనకు అబార్షన్ కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం గర్భదాల్చడంతో అబార్షన్‌కు అనుమతించాలని కోరింది. తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని, మానసికంగా లేదా ఆర్థికంగా మూడో బిడ్డను పెంచే స్థితిలో లేనని చెప్పింది. తాను గర్బనిరోధక పద్దతి ఫాలో అవ్వడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరగడం లేదని, బిడ్డ ప్రాణాలతో పుట్టే అవకాశాలు కూడా లేదని.. అబార్షన్‌కు అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 9న అబార్షన్‌కు అనుమతించింది.
అయితే మహిళ గర్భం దాల్చి 25వారాలు దాటడంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అబార్షన్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని వైద్యుల బృందం ఇచ్చిన సలహాను ఉటంకిస్తూ కేంద్రం ఆర్డర్‌ను రీకాల్ చేయాలని కోరింది. ఈ క్రమంలోనే అబార్షన్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఈ నెల 10న సుప్రీం కోర్టు వైద్యులను ఆదేశించింది. ఆ తర్వాత ఈ కేసును జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం సీజేఐ ధర్మాసనానికి కేసును సిఫారసు చేసింది. ఈ క్రమంలోనే సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్.. ఇంతకు ముందు మహిళ అబార్షన్‌కు ఎందుకు అనుమతి తీసుకోలేదని ప్రశ్నించారు. ‘‘ఆమె 26 వారాలుగా ఏమి చేస్తోంది? ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? మేము న్యాయపరమైన తీర్పు ద్వారా పిల్లల మరణానికి ఆర్డర్ ఇవ్వాలా?’’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.