సినీ రంగంలోకి అడుగుపెట్టాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. వాటిని నిజం చేసుకునే ప్రయత్నాలు కూడా చాలానే చేస్తుంటారు. అయితే... ఈ రంగంలోకి అడుగుపెట్టాలనే వారి కలలను ఆసరాగా చేసుకొని చాలా మంది మోసం చేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు ఇలా మోసపోయారు. తాజాగా మరో మోసగాడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్ కతాలో చోటుచేసుకుంది. ఓ థియేటర్ ఆర్టిస్ట్... నటన నేర్పుతానంటూ అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.... కోల్‌కతా నగరానికి చెందిన సుదీప్తా ఛటోపాధ్యాయ కళాశాలలో థియేటర్ ఆర్ట్ ప్రొఫెసరుగా పనిచేశారు. నటించడంలో మెళకువలు నేర్పిస్తానని చెప్పి సుదీప్టో ఛటర్జీ తనను లైంగికంగా వాడుకున్నాడని ఓ అమ్మాయి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో నటన నేర్పుతానని చెప్పి తమపై కూడా ఛటోపాధ్యాయ అత్యాచారం చేశాడని మరో ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారని కోల్‌కతా పోలీసు డిప్యూటీ కమిషనర్ దేబాస్మిత దాస్ చెప్పారు.

కోల్‌కతా నగరంలో థియేటర్ ఆర్టిస్టుగా రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న ఛటోపాధ్యాయ న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందారు. ఛటోపాధ్యాయ ఫిర్యాదు చేసిన ముగ్గురు అమ్మాయిల వయసు 20 ఏళ్లని పోలీసులు చెప్పారు.

తనకు నటనలో మెళకువలు నేర్పుతానని చెప్పి అతను ఇంటికి పిలిచి మంచంపై పడుకొని, కళ్లు మూసుకొని డైలాగులు చెప్పాలని కోరాడని, అనంతరం తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం ఘటన గురించి మర్చిపోవాలని ఛటోపాధ్యాయ భార్య తనను కోరిందని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.కాగా నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.