బీజేపీ సీనియర్ నేత డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. డీఎంకే లోక్ సభ సభ్యులు కనిమొళి, ఏ. రాజాలు 2జీ స్పెక్ట్రమ్ అవినీతి కేసులో మళ్లీ జైలుకి వెళ్లే రోజులు దగ్గరపడుతున్నాయని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.

తిరునల్వేలి శంకర్‌నగర్‌లోని ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం సుబ్రమణ్యస్వామి విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ కుంటుపడలేదని, గత యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంలోనే ఇది జరిగిందన్నారు. ఆర్థికవేత్తగా వుంటూ ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్‌సింగ్‌ చేపట్టిన తప్పుడు విధానాలే ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయన్నారు. 

ప్రధాని నరేంద్రమోదీ సంక్షేమ పథకాలను అమలుపరచడంలో అందరికంటే ముందుంటారని, అయితే ఆయనకు, అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారమన్‌కు ఆర్థికం గురించి అంతగా తెలియదన్నారు. ఇందువల్ల వారు ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని సరికట్టలేరని తెలిపారు. 2జీ స్పెక్ట్రమ్‌ అవినీతి కేసులో డీఎంకే ఎంపీలు కనిమొళి, ఎ.రాజాలు త్వరలోనే జైలుకు వెళతారని స్వామి జోస్యం చెప్పారు.