Madhya Pradesh: మెగాస్టార్ చిరంజీవి న‌టించిన శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో మెడిక‌ల్ కాలేజీలో సీటు సంపాదించ‌డానికి చెవిలో హియ‌ర్‌ఫోన్స్ పెట్టుకుని ప‌రీక్ష రాస్తాడు. ఇపుడు ఆదే త‌ర‌హాలో ఏకంగా స‌ర్జ‌రీ చేయించుకుని చెవిలో మైక్రో బ్లూటూత్ పెట్టుకుని హైటెక్ మాస్ కాపీయింగ్ కు పాల్ప‌డ్డారు ఇద్ద‌రు మెడిక‌ల్ కాలేజీ (ఎంబీబీఎస్‌) విద్యార్థులు.  

Madhya Pradesh: శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మెడిక‌ల్ కాలేజీలో సీటు సంపాదించ‌డానికి చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని ప‌రీక్ష‌రాస్తూ.. మోసం చేస్తున్న దృశ్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇదే త‌ర‌హాలో మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్‌లో ఇలాంటి మోసానికి సంబంధించిన‌ ఉదంతం వెలుగులోకి రావడంతో శంక‌ర్ దాదాను సైతం ఉలిక్కిపడేలా చేసింది. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వివ‌రాల్లోకెళ్తే.. ఎంబీబీఎస్ ప‌రీక్ష‌లో పాస్ కావ‌డానికి ప‌రీక్ష‌ల్లో హైటెక్ కాపీయింగ్ కు తెర‌లేపారు ఇద్ద‌రు ఎంబీబీఎస్ విద్యార్థులు. ఏకంగా చెవిలో మైక్రో బ్లూటూత్ పెట్టించుకోవ‌డానికి స‌ర్జ‌రీ కూడా చేయించుకున్నాడు. మ‌రో విద్యార్ధిని క‌నిపించ‌కుండా చిప్ రూపంలో ఉండే బ్లూటూత్ డివైస్ పెట్టుకుని ప‌రీక్ష‌లో హైటెక్ చీటింగ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే, త‌నిఖీల‌కు వ‌చ్చిన స్క్వాడ్‌కు ఆ విద్యార్థిపై అనుమానం క‌లిగ చెక్ చేయ‌గా.. ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. సర్జ‌రీ చేయించుకుని మైక్రో బ్లూటూత్ ను చెవిలో పెట్టుకున్న విష‌యం తెలిసి అంద‌రూ ఆశ్చర్యపోయారు.

అసలు క‌థ ఇది.. ! 

ఎంబీబీఎస్ ప‌రీక్ష‌ల్లో చీటింగ్ కు పాల్ప‌డ‌టానికి ఏకంగా స‌ర్జ‌రీ చేయించుకుని చెవిలో మైక్రో బ్లూటూత్ పెట్టించుకుని ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ మ‌హాత్మా గాంధీ మెడిక‌ల్ కాలేజీలో చోటుచేసుకుంది. పరీక్ష ప్రారంభమైన గంట తర్వాత జబల్‌పూర్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం కళాశాల‌లో త‌నిఖీలు చేయ‌డానికి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే అనుమానం క‌లిగి.. స‌ద‌రు విద్యార్థిని చెక్ చేయ‌గా.. ఒక మొబైల్ ఫోన్ దొరికింది. ఇదేంటని ఆయన్ను ప్రశ్నించగా.. ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చాడు. హైటెక్ మోసానికి పాల్ప‌డుతూ.. పరీక్షలో ఫోన్ ద్వారా మోసం చేసేందుకు చెవికి శస్త్ర చికిత్స చేసి బ్లూటూత్‌ను అమర్చినట్లు విద్యార్థి స్క్వాడ్ బృందానికి చెప్పాడు. అలాగే, తన మరొక స్నేహితుడు చెవికి శస్త్రచికిత్స చేసి పరికరాన్ని అమర్చాడని కూడా చెప్పాడు. ఆ తర్వాత యూనివర్సిటీ బృందం ఆ విద్యార్థిని కూడా పట్టుకుంది.

ఈ ఘ‌ట‌న అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేయ‌డంతో పాటు హైటెక్ చీటింగ్‌.. అది మెడిక‌ల్ విద్య‌లో చోటుచేసుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇక స‌ద‌రు విద్యార్థిని పట్టుకున్న ప‌రీక్ష జ‌రిగే గదిలో 20 మంది విద్యార్థులను చూసేందుకు ఒక మహిళా ఉపాధ్యాయులు మాత్ర‌మే ఉన్నారు. కళాశాల అడ్మినిస్ట్రేషన్ నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌ర‌స్తున్న‌ద‌ని ఆరోపణలు వస్తున్నాయి. అయితే పరీక్ష హాలును పర్యవేక్షించేందుకు పురుష ఉపాధ్యాయుడితో పాటు మహిళా ఉపాధ్యాయురాలు ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఇప్పుడు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కళాశాలకు నోటీసు జారీ చేసింది. దీనిపై సమాధానాలు ఇవ్వాల‌ని కోరింది. ఎందుకంటే మహిళా పరిశీలకులు మాత్రమే ఉండటం వల్ల, విద్యార్థులను తనిఖీ చేయలేకపోయారు.. ఈ క్రమంలోనే విద్యార్థులు ప‌రీక్షలు జ‌రిగే హాలులోకి ఫోన్ల‌ను తీసుకెళ్లారు. 

కాగా, ప్ర‌స్తుతం హైటెక్ కాపీయింగ్ చేస్తూ ప‌ట్టుబ‌డిన ఈ విద్యార్థులు ఇద్ద‌రూ దేవి అహల్య విశ్వవిద్యాలయంకు చెందిన వైద్య విద్యార్థులు. ఎంబీబీఎస్ ఫైన‌ల్ పరీక్షల్లో పాస్ కావ‌డానికి చెవికి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత చెవిలో బ్లూటూత్ పరికరాన్ని అమర్చుకున్నారు. స‌ద‌రు విద్యార్థి కాలేజీలో చేరి 11 సంవ‌త్స‌రాలు అవుతున్న‌ద‌ని స‌మాచారం. ప‌దేప‌దే ఫెయిల్ అవుతుండ‌టంతో చివ‌ర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని తెలిసింది.