Asianet News TeluguAsianet News Telugu

కిరణ్ బేడీ యానాం చిచ్చు, ఎపీకి ఓ ద్వీపం: స్టాలిన్, నారాయణస్వామి గగ్గోలు

యానాంలోని ఓ ద్వీపాన్ని ఎపీకి కట్టబెట్టేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రయత్నిస్తున్నారు. కిరణ్ బేడీపై డీఎంకె నేత స్టాలిన్, యానాం సీఎం నారాయణ స్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారికి కిరణ్ బేడీ కౌంటర్ ఇచ్చారు.

stalin accuses kiran bedi of trying to give away a part of yanam to andhrapradesh
Author
Yanam, First Published Oct 22, 2019, 1:33 PM IST

యానాం: హుజూర్ నగర్ ఉప ఎన్నిక, ఆర్టీసీ సమ్మెలో మునిగిపోయి తమిళనాట జరుగుతున్న ఒక మాటల యుద్ధాన్ని మనం అంతగా పట్టించుకోలేదు. డీఎంకే నేత స్టాలిన్ పుదుచ్చేరి లెఫ్టనెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై తీవ్ర విమర్శలు చేసారు. ఆంధ్రప్రదేశ్ కు పుదుచ్చేరి ఆస్తులు అప్పగించడానికి కుట్ర చేస్తున్నారని విరుచుకు పడ్డారు. దీనికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా వంత పాడారు. 

వివరాల్లోకెళితే, పుదుచ్చేరి లోని నాలుగు జిల్లాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ ని ఆనుకొని ఉన్న యానాం. దీని పరిధిలోని ఒక ద్వీపాన్ని ఆంధ్రప్రదేశ్ కు అప్పగించేందుకు పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ ప్రయత్నిస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. దీనికి స్పందిస్తూ కిరణ్ బేడీ కూడా ఘాటుగానే స్పందించారు. అక్కడ పర్యావరణానికి జరుగుతున్న హానిని తాను స్వయంగా చూశానని, గోదావరి పరిసరాలు పర్యావరణ పరంగా ఎంతో సున్నిత ప్రాంతాలని, అక్కడ ఆ పరిసరాల నాశనం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం నాలుగు జిల్లాలతో మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. తమిళనాడు లో పుదుచ్చేరి,కరైకల్ రెండు జిల్లాలు కాగా కేరళలోని మాహె మూడో జిల్లా. మన ఆంధ్రప్రదేశ్ లోని యానాం నాలుగో జిల్లా. ఇలా మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పుదుచ్చేరి గతంలో ఫ్రెంచ్ ఆధీనంలో ఉండేది. ఆ ప్రాంతాలు భారత దేశంలో విలీనం అయ్యాక వాటిని అలాగే ఉంచి భారత దేశం వాటిన్నింటిని కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. 

పుదుచ్చేరీకి 870 కిలోమీటర్ల దూరంలో ఉంది యానాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాను ఆనుకొని ఉంటుంది. యానాం పరిధిలోని 5వ నెంబర్ ద్వీపంపై కాంక్రీట్ తోని అక్రమ కట్టడాలను కట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందనేది ప్రధాన వివాదం. టూరిజం పేరుతో ఇలా పర్యావరణానికి నష్టం కలిగిస్తే మన భవిష్యత్తే అంధకారంలోకి నెట్టి వేయబడుతుందని, ఇక్కడ రివ్యూకి వచ్చిన ఎల్జీ కిరణ్ బేడీ అభిప్రాయపడ్డారు.ఇలాంటి పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో కాంక్రీటు నిర్మాణాలను చట్టం నిషేధిస్తుందని ఆమె అన్నారు. అంతేకాకుండా ఈ ద్వీపం తమదని  ఆంధ్రప్రదేశ్ వాదిస్తోందని, ఆ కేసు ఇంకా ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో పెండింగులో ఉందని ఆమె తెలిపారు.

ఇంతకు స్టాలిన్ ఏమన్నారు?

కామరాజ్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జాన్ కుమార్ తరుఫున ప్రచారం చేస్తూ,కిరణ్ బేడీ యానాం లోని ఒక ద్వీపాన్ని ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రపాలిత ప్రాంతంలో నేరుగా బీజేపీ పాలన తీసుకురావడానికి కిరణ్ బేడీ ప్రయత్నిస్తున్నారని స్టాలిన్ ధ్వజమెత్తారు. 

ముఖ్యమంత్రి నారాయణ స్వామి పుదుచ్చేరీకి పూర్తి రాష్ట్ర హోదా తీసుకురావడం  కోసం పగలనకా రేయనకా కష్టపడుతుంటే, గవర్నర్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారని స్టాలిన్ ఆక్షేపించారు. యానాం లోని ఒక ద్వీపాన్ని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు కట్టబెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విరుచుకుపడ్డారు. గవర్నర్ కిరణ్ బేడీ గారు చేస్తున్న ఈ మోసం మామూలు మోసం కాదని, ఒక రకంగా ఇది వెన్నుపోటే అని స్టాలిన్ మండిపడ్డాడు. 

స్టాలిన్ ఈ ఆరోపణలు చేసిన వెంటనే పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి కోరస్ అందుకున్నారు. లెఫ్టనెంట్ గవర్నర్ కిరణ్ బేడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుఫున హై కోర్టులో పిటిషన్ వేసిన పిటిషన్ దారుడ్ని కలుసుకున్నారని, కేసు కొనసాగుతున్నప్పుడు ఇలా అవతలి తరుపు వ్యక్తిని కలవడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఆయన అన్నారు. పుదుచ్చేరి పరిపాలనాంశాల్లో గవర్నర్ తలదూరుస్తున్నారని చాల కాలంగా స్టాలిన్ తో సహా పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. 

కిరణ్ బేడీ స్పందన:

అక్రమ నిర్మాణాలపై తనకందిన ఫిర్యాదుల్లో వాస్తవమెంతో తెలుసుకునేందుకు తాను యానాం వెళ్లానని అన్నారు. అక్కడ పర్యావరణానికి హాని కలుగుతున్న మాట వాస్తవమేనని తాను స్వయంగా తెలుసుకున్నానని అన్నారు. ఇలాంటి అక్రమ కట్టడాల వల్ల పర్యావరణం దెబ్బతినడంతోపాటు పప్రజాధనం కూడా వృధా అవుతుందని ఆమె పేర్కొన్నారు. గోదావరి సంగమ ప్రాంతం పర్యావరణ పరంగా చాలా సున్నితమైన ప్రాంతమని తెలిపారు. అక్కడ నీటి ఉధృతిలో ఉండే మార్పుల వల్ల అక్కడున్న ద్వీపాలపైన నిర్మాణాలు చేయడం పర్యావరణ హితం కాదని అభిప్రాయపడ్డారు. చట్టాలు ఇలాంటి నిర్మాణాలను అనుమతించవని ఆమె కోస్టల్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉటంకిస్తూ పేర్కొన్నారు. 

ఇలాంటి అసత్యపు ఆరోపణలను రాజకీయ నాయకులూ మానుకోవాలని ఆమె హితవు పలికారు. అక్కడ చేపట్టిన నిర్మాణం కొట్టుకుపోయిందని, దాని నిర్మాణానికి వెచ్చించిన 5కోట్లు ప్రజల సొమ్ము కాదా అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రజలకు నిజాలు తెలియపరచాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. అసత్యపు ప్రచారాలు నిజాలను దాచలేవని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. 

ఈ వివాదం ఇప్పుడు పూర్తి రాజకీయ రంగు పులుముకోవడంతో ఇప్పుడప్పుడు సమసిపోయే విధంగా కనపడడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయమై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కోర్టు పరిధిలో ఉన్నందున ఏమీ స్పందించబోమనే సమాధానాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేలా కనిపిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios