Asianet News TeluguAsianet News Telugu

UP Assembly Election 2022: యూపీ ఎన్నిక‌లు.. ‘సంభ‌ల్ గున్నౌర్’ నుంచి అఖిలేశ్ యాద‌వ్ పోటీ !

UP Assembly Election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్ మొద‌టిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తుండ‌టంతో.. స‌మాజ్ వాదీ పార్టీ నేత‌, మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ సైతం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుని అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆయ‌న బ‌రిలో నిలిచే స్థానంపై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాజ్‌వాదీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.  
 

SP chief Akhilesh Yadav may contest UP polls from Gunnaur
Author
Hyderabad, First Published Jan 20, 2022, 12:20 AM IST

UP Assembly Election 2022: వ‌చ్చే నెల‌లో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు హీటు పెంచాయి. ఈ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అన్ని ప్ర‌ధాన పార్టీలు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్రచారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతుండ‌టంతో యూపీ రాజ‌కీయాలు కాక రేపుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్‌, రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్.. త‌న‌దైన స్టైల్ లో ఎన్నిక‌ల (UP Assembly Election 2022) ప్ర‌చారం కొన‌సాగిస్తూ.. ముందుకు సాగుతున్నారు. అధికార పీఠం ద‌క్కించుకోవ‌డ‌మే లక్ష్యంగా ప‌క్కా ప్రణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్న‌ట్టుగా తెలుస్తున్న‌ది. 

అధికార పార్టీ బీజేపీకి బ‌ల‌మైన పోటీదారుగా నిలుస్తూ.. క‌మ‌లం మ‌ళ్లీ విక‌సించ‌కుండా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని ఇదివ‌ర‌కు ప్ర‌క‌టించిన అఖిలేష్ యాద‌వ్ (SP chief Akhilesh Yadav) త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. బీజేపీ నుంచి మొద‌టి సారి అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తున్న ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ నిర్ణ‌యంతో.. అఖిలేష్ కూడా త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. అయితే, అఖిలేశ్ యాద‌వ్ పోటీ చేసే స్థానంపై ఇంకా సందిగ్ధ‌త కొన‌సాగుతూనే ఉంది.  ఆయ‌న పోటీ చేసే స్థానాల గురించి ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు విన‌బ‌డ్డాయి. అయితే, అఖిలేష్ పోటీ చేసే స్థానంపై బుధ‌వారం ఓ క్లారిటీ వ‌చ్చిన‌ట్లే వ‌చ్చింది. ఆజంగ‌ఢ్ నుంచి అఖిలేశ్ బ‌రిలోకి దిగుతున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అదే ఫైన‌ల్ అని కూడా స‌మాజ్‌వాదీ లోని  ఓ వ‌ర్గం బాగా ప్ర‌చారం చేసింది. 

అయితే, ఆయన (SP chief Akhilesh Yadav) ఆజంగ‌ఢ్ నుంచి కూడా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డం లేద‌ని స‌మాచారం. సంభ‌ల్ గున్నౌర్ నుంచి అఖిలేశ్ బ‌రిలోకి దిగాల‌ని దాదాపుగా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని స‌మాజ్ వాదీ పార్టీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. అఖిలేష్ యాద‌వ్ సంభ‌ల్ గ‌న్నౌర్ నియోజ‌కవ‌ర్గం నుంచి బ‌రిలో నిల‌వ‌డానికి కార‌ణం అక్క‌డ ఆ పార్టీ బ‌లంగా ఉండ‌ట‌మేన‌ని తెలుస్తోంది. సంభ‌ల్ గున్నౌర్ స‌మాజ్‌వాదీకి ఎప్ప‌టి నుంచో కంచు కోట‌లా వుంటూ వ‌స్తోంది.  స‌మాజ్‌వాదీ స్థాప‌కుడు, యూపీ (Uttar Pradesh) మాజీ ముఖ్య‌మంత్రి ములాయం యాద‌వ్ ఇక్క‌డి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే, అఖిలేశ్ యాద‌వ్  బాబాయ్ రాంగోపాల్ యాద‌వ్‌, జావేద్ అలీఖాన్ కూడా ఇక్క‌డి నుంచి బ‌రిలోకి దిగారు.

అలాగే, ఈ సంభ‌ల్ గన్నౌర్ నియోజ‌క‌వ‌ర్గంలో యాద‌వుల బ‌లంగా ఉన్నారు. కాబ‌ట్టి అఖిలేష్ క‌లిసివ‌స్తుంద‌ని చెప్ప‌డంలో సందేహంల లేదు. అలాగే,  ఇక్క‌డ దాదాపు 40 శాతం ముస్లింల జ‌నాభా వుంది.  వీరి నుంచి స‌మాజ్ వాదీకి అనుకూల స్పంద‌న ఉండ‌టంతో ఇక్క‌డే నుంచి SP chief Akhilesh Yadav పోటీ చేయాల‌ని అఖిలేష్ నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం. కాగా, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుండి ప్రారంభమవుతాయి.  మొత్తం 403 స్థానాలకు ఏడు దశల్లో  ఎన్నిక‌లు నిర్వహించబడతాయి. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, మార్చి 7 తేదీల్లో ఓటింగ్ నిర్వహించగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios