విషం ఉన్న పాము కరిస్తే ఎవరైనా చచ్చిపోతారు. అయితే... ఓ బాలుడిని కరిచిన తర్వాత పామే గిలగిలాకొట్టుకుంటూ చనిపోయింది. అయితే.. ఈ ఘటనలో పాము కాటుకి గురైన బాలుడు కూడా చనిపోయాడు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జౌన్ పూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... జౌన్ పూర్ లోని ముంగరాబాద్ షాప్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడాగావ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. బడాగావ్ ప్రాంతానికి చెందిన ఓ 8ఏళ్ల బాలుడు అంశ్ శౌర్య  ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. కాగా.... ఆ సమయంలో ఓ విష సర్పం వచ్చిబాలుడిని కాటు వేసింది. బాలుడుని కాటు వేసిన వెంటనే పాము గిలగిల కొట్టుకుంటూ చనిపోవడం గమనార్హం.

మరోవైపు అంశ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు బాధితుడిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ బాధితుని ఆరోగ్యం కుదుటపడకపోవడంతో కుటుంబసభ్యులు తిరిగి ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందాడని నిర్థారించారు. కాగా బాలుడిని కాటువేసిన వెంటనే పాము మృతి చెందడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.