బ్రిజ్ భూషణ్ సింగ్ కు షాక్.. డబ్ల్యూఎఫ్ఐ కొత్త ప్యానెల్ సస్పెండ్.. కారణమేంటంటే ?
భారత రెజ్లింగ్ సమాఖ్య (Wrestling Federation of India) కొత్త ప్యానెల్ ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ (Sports Ministry ) రద్దు (suspend) చేసింది. సంజయ్ సింగ్ (Sanjay singh) ఆధ్వర్యంలోని ఈ కొత్త కమిటీ నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
బ్రిజ్ భూషణ్ సింగ్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-డబ్ల్యూఎఫ్ఐ) కొత్త ప్యానెల్ ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ప్రెసిడెంట్ గా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్ కు ఈయన సన్నిహితుడు. ఈ కొత్త ప్యానెల్ ఇంకా పూర్తి స్థాయిలో పాలన మొదలు పెట్టకముందే క్రీడా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ గా ఎన్నికైన సంజయ్ కుమార్ సింగ్ ఈ నెల 21వ తేదీన మాట్లాడుతూ.. రెజ్లింగ్ అండర్ -15, అండర్ -20 నేషనల్స్ ఈ సంవత్సరం చివరిలోగా గోండా (యూపీ) లోని నందిని నగర్ లో జరుగుతాయని ప్రకటించారని తెలిపింది. ఈ నేషనల్స్ లో పాల్గొనాల్సిన రెజ్లర్లకు తగిన నోటీసు ఇవ్వకుండానే
డబ్ల్యూఎఫ్ ఐ రాజ్యాంగ నిబంధనలను పాటించకుండా ఈ తొందరపాటు ప్రకటన చేశారని క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
‘‘డబ్ల్యూఎఫ్ ఐ రాజ్యాంగ పీఠికలోని క్లాజ్ 3(ఈ) ప్రకారం.. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లో యూడబ్ల్యూడబ్ల్యూ నిబంధనల ప్రకారం సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ నేషనల్ చాంపియన్ షిప్ లను నిర్వహించాలన్నది డబ్ల్యూఎఫ్ ఐ లక్ష్యం. అటువంటి నిర్ణయాలను కార్యనిర్వాహక కమిటీ తీసుకుంటుంది. దీనికి ముందు ఎజెండాలను పరిశీలించాల్సి ఉంటుంది. డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 ప్రకారం.. సమావేశాలకు 15 రోజులకు ముందు నోటీసులు ఇచ్చి 1/3 వంతుతో దానిని ఆమోదించాల్సి ఉంటుంది. అత్యవసర సమయాల్లో అయితే కనీసం 7 రోజుల వ్యవధి అవసరం’’ అని పేర్కొంది.
కానీ కొత్త ప్యానెల్ తీసుకున్న నిర్ణయాలు నిబంధనలు విస్మరించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందుకే ఈ ప్యానెల్ ను రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. కాగా.. డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ డిసెంబర్ 21న ఎన్నికైన వెంటనే భారత్ కు పతాలకు తీసుకొచ్చిన రెజర్ల నుంచి అసహనం వ్యక్తం అయ్యింది. తాను రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నాని సాక్షి మాలిక్ ప్రకటించారు. దీంతో పాటు బజరంగ్ పూనియా కూడా తన అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దానిని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. దీంతో భారత రెజ్లింగ్ సమాఖ్య మరో సారి వార్తల్లో నిలిచింది.