Asianet News TeluguAsianet News Telugu

మేనిఫెస్టోలో తప్పు.. ఆడుకుంటున్న నెటిజన్లు, దేశ ప్రజలకు శశిథరూర్ క్షమాపణలు

దేశ ప్రజలకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ క్షమాపణలు చెప్పారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రచురించిన ఇండియా మ్యాప్‌లో జమ్మూకాశ్మీర్, లఢఖ్ లేవు. దీనిపై పెనుదుమారమే రేగింది. 
 

Shashi Tharoor's unconditional apology after India map blunder in manifesto for congress president election
Author
First Published Sep 30, 2022, 8:52 PM IST

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన మేనిఫెస్టో విడుదల చేశారు. అయితే అందులో ప్రచురించిన ఇండియా మ్యాప్‌లో జమ్మూకాశ్మీర్, లఢఖ్ లేవు. దీనిపై పెనుదుమారమే రేగింది. సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు నెటిజన్లు. దీనిపై తక్షణం స్పందించిన శశిథరూర్ అందరికీ క్షమాపణలు చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని.. వాలంటీర్ల బృందం పొరపాటు చేసిందని వివరణ ఇచ్చారు. వెంటనే దీనిని సవరించామని.. జరిగిన పొరపాటుకు క్షమించాలని కోరారు శశిథరూర్. ఈ మేరకు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందించిన మేనిఫెస్టో కాపీలను ట్వీట్ చేశారు. 

అయితే శశిథరూర్ ఇండియా మ్యాప్‌కు సంబంధించి తప్పు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2019 డిసెంబర్‌లో భారత పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తున్న సమయంలోనూ ఓ ట్వీట్ చేసి అందులోనూ ఇలాంటి తప్పు చేశారు . దీనిపై బీజేపీ నేతలతోపాటు నెటిజన్లు విరుచుకుపడటంతో థరూర్ వెంటనే ట్వీట్‌ను డిలీట్ చేశారు. 

కాగా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో శశిథరూర్‌తో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి కేఎన్ త్రిపాఠిలు కూడా శుక్రవారం నామినేషన్‌లు దాఖలు చేశారు. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. పోటీలో ఒకరికి మించి అభ్యర్థులు వున్న పక్షంలో అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించి.. అక్టోబర్ 19న ఫలితాలను వెల్లడించనున్నారు. 

ALso REad:ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు: నామినేషన్ దాఖలు చేసిన శశిథరూర్

కాంగ్రెస్ పార్టీలో జీ 23 నేతల్లో ఒకరుగా శశిథరూర్ ఉన్నారు. పార్టీని ప్రక్షాళన చేయాలని  కోరిన నేతల్లో  శశిథరూర్ తో పాటుఆజాద్ వంటి నేతలు కూడా ఉన్నారు. ఆజాద్ , కపిల్ సిబల్ వంటి నేతలు పార్టీ నుండి బయటకు వెళ్లిపోయారు.  అయితే శశిథరూర్ మాత్రం పార్టీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేస్తున్నారు.

ఇకపోతే... మల్లికార్జున ఖర్గేకు దిగ్విజయ్ సింగ్ మద్దతు ప్రకటించారు. ఇవాళ ఖర్గేతో భేటీ అయిన తర్వాత దిగ్విజయ్ సింగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీలో మల్లికార్జున ఖర్గే చాలా సీనియర్ నాయకుడని ఆయన గుర్తు చేశారు. ఖర్టే పోటీ చేస్తున్నందున ఆయనకే తాను మద్దతు ఇస్తున్నట్టుగా దిగ్విజయ్ సింగ్  స్పష్టం చేశారు. మరో వైపు రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ కూడా మల్లికార్జున ఖర్గేకు మద్దతు ప్రకటించారు. గెహ్లాట్ కూడా ఎఐసీసీ చీఫ్ రేసులో ఉన్నట్టుగా మొదట్లో ప్రచారం సాగింది. అయితే రాజస్థాన్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గెహ్లాట్ ఎఐసీసీ చీఫ్ పదవి రేసు నుండి తప్పుకున్నారు. అటు ఈ రేసులో తాను లేనని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ తేల్చి చెప్పారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios