లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీలో లోక్‌తాంత్రిక్ జనతా దళ్ (ఎల్‌జేడీ) పార్టీ విలీనమైంది. ఆదివారం న్యూఢిల్లీలో ఈ విలీన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శరద్ యాదవ్ మాట్లాడుతూ.. విపక్షాల ఐక్యతకు దీనిని తొలి అడుగుగా అభివర్ణించారు. 

లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీలో లోక్‌తాంత్రిక్ జనతా దళ్ (ఎల్‌జేడీ) పార్టీ విలీనమైంది. ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ (Sharad Yadav) తన ఎల్‌జేడీ పార్టీని ఆదివారం న్యూడిల్లీలో ఆర్‌జేడీలో విలీనం చేశారు. శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు విడిపోయిన 25 ఏళ్ల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ విలీన ప్రక్రియ సందర్భంగా శరద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు రాజకీయాల్లో యువత అవసరం ఉందన్నారు. 

విపక్షాల ఐక్యతకు తొలి అడుగుగా తమ పార్టీని ఆర్జేడీలో విలీనం చేసినట్టు శరద్ యాదవ్ చెప్పారు. బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకం కావడం తప్పనిసరి అని ఆయన అన్నారు. ప్రస్తుతానికి ఏకీకరణ తమ ప్రాధాన్యత అని.. తర్వాత మాత్రమే ఐక్య ప్రతిపక్షానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దాని గురించి ఆలోచిస్తామని తెలిపారు.

‘అతను (తేజస్వి) భవిష్యత్తు. నేడు యువత కావాలి. ఆర్జేడీ మీ పార్టీ.. దాన్ని అంతా కలిసి బలోపేతం చేయాలి. తేజస్వికి మద్దుతుగా నిలవండి. నేను మునుపటిలా చురుకుగా ఉండలేను. కానీ నేను అతనిని బలపరచడానికి నా వంతు కృషి చేస్తాను. మా పోరాటాన్ని బలోపేతం చేసేందుకు అఖిలేష్‌తో మాట్లాడతాం.. లాలూ ప్రదాద్ ఏదో ఒక రోజు స్వేచ్ఛగా బయట తిరుగుతారు. మతతత్వ శక్తులతో రాజీపడి ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉండేవాడు కాదు’ అని శరద్ యాదవ్ పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ఆర్జేడీ నేత, బిహార్ ప్రతిపక్షనేత తేజస్వీ ప్రసాద్ యాదవ్ (Tejashwi Prasad Yadav) మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ద్వేషం వ్యాప్తి చెందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోదరభావం ప్రమాదంలో పడిపోయిందన్నారు. ధరల పెరుగుదల కొనసాగుతుందని తెలిపారు. రాజ్యాంగ సంస్థలను పార్టీల విభాగాలు మార్చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్భణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. శరద్ యాదవ్ ఆయన పార్టీని ఆర్జేడీలో విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయం తమకు మరింత బలం, విశ్వాసాన్ని అందజేస్తాయని విశ్వాసం కలిగిస్తోంది. ఇది ప్రతిపక్ష పార్టీలకు ఓ సందేశాన్ని పంపుతుందన్నారు. 

2019 తర్వాతే విపక్షాలు కలిసి ఒకతాటిపైకి రావాల్సిందని అభిప్రాయపడ్డారు. సోషలిస్టు శక్తులు చేతులు కలిపితేనే మతతత్వ శక్తులను తరిమికొట్టగలుగుతామని ధీమా వ్యక్తం చేశారు. మైనారిటీల ఓటు హక్కును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.. కానీ తాము అలా జరగనివ్వమని తేజస్వి అన్నారు. 

ఇక, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 1997లో జనతాదళ్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. దాణా కుంభకోణంపై విచారణ సందర్భంగా పార్టీ నాయకత్వంలో అభిప్రాయ భేదాల ఫలితంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీని వీడి.. తన సొంత పార్టీ ఆర్జేడీని స్థాపించాడు. ఆ తర్వాత కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్.. JD(U)కి చెందిన శరద్ యాదవ్‌ను ప్రత్యర్థులుగా మారారు. ఇక, కొన్నేళ్ల క్రితం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో శరద్ యాదవ్ 2018లో ఎల్‌జేడీని స్థాపించారు.