సీనియర్ దక్షిణాది హీరోయిన్, కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత.. బీజేపీలోకి అడుగుపెట్టనున్నారా..? అవుననే సమాధానం ఎక్కువగా వినపడుతోంది. మొన్నటికి మొన్నే.. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ప్రకటించిన సుమలత.. ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. 

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే... మాండ్యా లోక్ సభ సీటు నుంచి సుమలత  కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆమె కూడా ఈమేరకు ఏర్పాట్లు చేసుకుంది.టికెట్‌ కోసమే మాజీ సీఎం సిద్దరామయ్యను కలిసి మండ్య నుంచి పోటీ చేసే అంశాన్ని ప్రస్తావించారు.

 అయితే.. సడెన్ గా.. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ కి ఆ టికెట్ ని కన్ఫామ్ చేశారు. మండ్య నుంచి నిఖిల్‌కుమార్‌ పోటీ చేస్తారని ఇందులో ఎటువంటి మార్పులేదని జేడీఎస్‌ దళపతి దేవేగౌడ తేల్చి చెప్పారు. దీనికి తోడు మంగళవారం సమన్వయ కమిటీ ఛైర్మన్‌ సిద్దరామయ్య కూడా పొత్తు నేపథ్యంలో  మండ్య స్థానం జేడీఎస్‌కు వదిలేస్తున్నామని అక్కడ కాంగ్రెస్‌ పోటీ చేసే ప్రసక్తే లేదన్నారు. 

కాంగ్రెస్‌ నుంచి పోటీ అసాధ్యమని తేలిపోవడంతో సుమలత భవిష్యత్‌పై సర్వత్రా చర్చ సాగుతోంది. ఎలాగైనా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్న ఆమె.. ఆమె అడుగులు బీజేపీ వైపు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరి.. ఆ పార్టీ టికెట్ తో మాండ్యాలో పోటీ దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం