కాశ్మీర్లో మారణహోమం సృష్టించడానికి ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను భద్రతా బలగాలు చేధించాయి. గతంలో భారత జవాన్ల కాన్వాయ్ పై దాడి చేసి అనేక మంది భద్రతా సిబ్బంది ప్రాణాలను బలిగొన్న పుల్వామా జిల్లాలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 

దక్షిణ కాశ్మీర్ పుల్వామా జిల్లాలోని రాజ్ పొర పట్టణంలో కారులో పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబును(ఐఈడీ) భద్రత బలగాలు నిర్వీర్యం చేసాయి. నాలుగైదు రోజుల కింద అందిన సమాచారంతో రాష్ట్ర పోలీసులు, సీఆర్పీఎఫ్ భద్రత బలగాలు కలిసి ఈ కారును పట్టుకున్నాయని, ఆ తరువాత బాంబు డిస్పోసల్ స్క్వాడ్ దీన్ని నిర్వీర్యం చేసినట్టుగా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 

కారును భద్రత బలగాలు ఆపే సమయంలో కారులో ఒక తీవ్రవాది కూడా ఉన్నట్టు తెలియవస్తుంది. కానీ పోలీసులు కారును ఆపడంతో ఆ తీవ్రవాది తప్పించుకొని పోయినట్టు భద్రత బలగాలు తెలిపాయి. ఆ తీవ్రవాదిని పట్టుకోవడానికి ఇప్పటికే భద్రతాబలగాలు గాలింపును మొదలుపెట్టాయని పోలీసులు తెలిపారు. 

ఇకపోతే... ఈ పుల్వామా దాడిలో మరో నిజం వెలుగులోకి వచ్చింది.  సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ఫీఎఫ్) కాన్వాయ్‌పై జరిగిన దాడిలో  పేలుడు పదార్థాలను ఆన్‌లైన్‌లో ఆ మారణ హోమం సృష్టించిన ఉగ్రవాది కొనుగోలు చేసినట్టు అధికారులు ఈ సంవత్సరం మార్చిలో గుర్తించారు. 

ఈ మేరకు  కొనుగోలు చేసిన ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌కు చెందిన వైజ్-ఉల్-ఇస్లాం (19), పుల్వామాకు చెందిన మహ్మద్ అబ్బాస్ రాథర్ (32)లను అదుపులోకి  తీసుకున్నారు. 

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ (జెఎమ్) ఆదేశాల మేరకు బ్యాటరీలు, బాంబుల తయారీకి  ఉపయోగపడే ఇతర రసాయనాలను నిందితుడు ఇస్లాం తన అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ ఖాతా  ద్వారా  కొనుగోలు చేసి, అనంతరం  ఉగ్రవాద సంస్థకు పంపిణీ చేసినట్టు  తెలిపారు.  

మరోనిందితుడు రాథర్ 2018 ఏప్రిల్ నుంచి మే మధ్యకాలంలో జైషే ఉగ్రవాది , ఐఈడీ బాంబుల తయారీ నిపుణుడు మొహద్ ఉమర్ తో పాటు ఇతర ఉగ్రవాదులైన ఆదిల్ అహ్మద్ దార్, సమీర్ అహ్మద్ దార్, కమ్రాన్ లకు తన ఇంట్లో  ఆశ్రయమిచ్చాడని పోలీసులు వెల్లడించారు.

నిందితులను శనివారం జమ్మూలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు హాజరుపరుస్తామని, ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. దాడిలో అమ్మోనియం నైట్రేట్, నైట్రో-గ్లిజరిన్ ఆర్డీఎక్స్ వంటి రసాయనాలను ఉపయోగించినట్టు  ఫోరెన్సిక్ నిఫుణులు వెల్లడించారు. 

పుల్వామా ఉగ్ర దాడిలో దాదాపు 40 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు ప్రాణుల కోల్పోయిన విషయం తెలిసిందే. 

ఈ ఘటనతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి.  ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని  ప్రజలు అభిప్రాయపడ్డారు.

అన్ని రాజకీయ పార్టీలు కూడ ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటన తర్వాత ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించిన ప్రధాని తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.

ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచంలోని పలు దేశాలు ఈ దాడులను ఖండించాయి. టెర్రరిజానికి వ్యతిరేకంగా జరిగే పోరుకు తమ మద్దతును ప్రకటించాయి.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఈ దాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్ కు ఎప్పుడూ స్నేహా హస్తం అందించే చైనా కూడ భారత్‌కు అండగా నిలిచింది. ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.