ఎస్డీపీఐ, పీఎఫ్ఐ రెండు ఒకటేనని... ఉగ్రవాద కార్యకలాపాల కోసం విదేశాల నుంచి డబ్బు సేకరించారని ఈడీ పేర్కొంది. ఎంకే ఫైజీ అరెస్ట్ పై ఈడి సంచలన వ్యాఖ్యలు చేసింది. 

MK Faizi Arrest : సోషల్ డొమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) జాతీయాధ్యక్షుడు ఎంజె ఫైజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) తో ఆర్థిక లావాదేవీలు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడి ఈయనను అరెస్ట్ చేసింది. అయితే తమ నాయకుడి అరెస్ట్ ను SDPI ఖండిస్తోంది. PFI తో SDPI కి ఎలాంటి సంబంధం లేదని... కానీ రాజకీయ కక్షసాధింపు కోసమే తప్పుడు అభియోగాలు మోపి కేంద్ర ప్రభుత్వమై ఈడితో అరెస్ట్ చేయించిందని ఎస్‌డిపిఐ ఆరోపిస్తోంది. 

SDPI అధ్యక్షుడు ఫైజి అరెస్ట్ పై ఈడి క్లారిటీ :

ఎస్‌డిపిఐ, పిఎఫ్ఐ రెండు వేరువేరు కాదు... ఒక్కటేనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంచలన కామెంట్స్ చేసింది. ఎస్‌డిపిఐ ఆర్థిక లావాదేవీలను పిఎఫ్ఐ నియంత్రిస్తోందని... ఈ పార్టీకి ఎన్నికల నిధులను పాపులర్ ఫ్రంట్ ఇస్తోందని ఈడీ పేర్కొంది. ఎస్‌డిపిఐ అభ్యర్థులను పిఎఫ్ఐ నిర్ణయిస్తోందని... ఎస్‌డిపిఐకి నాలుగు కోట్ల రూపాయల వరకు పిఎఫ్‌ఐ ఇచ్చిందని ఆధారాలు లభించాయని ఈడీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

గల్ఫ్ దేశాల నుంచి కూడా ఈ రెండు సంస్థలకు చట్టవిరుద్ధంగా డబ్బులు వచ్చాయని ఈడీ చెబుతోంది. ఎంకె ఫైజీకి తెలిసే ఈ లావాదేవీలన్నీ జరిగాయన్నారు. హవాలా మార్గాల ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు డబ్బు చేరవేశారని ఈడి పేర్కొంది.

అక్రమంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీలపై విచారించేందుకు 12 సార్లు నోటీసులు పంపినా ఫైజీ హాజరు కాలేదని ఈడి తెలిపింది. అందువల్లే ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.

పిఎఫ్ఐకి సంబంధించిన కేసులో ఇప్పటివరకు 61.72 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు. ఎస్‌డిపిఐ అంతర్గతంగా ఒక ఇస్లామిక్ సంస్థగా, బాహ్యంగా ఒక సామాజిక సంస్థగా పనిచేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. దేశంలో దాడులు, ఉగ్రవాద కార్యకలాపాలు చేయడానికి గల్ఫ్ దేశాల నుంచి డబ్బు సేకరిస్తున్నారు... రంజాన్ కలెక్షన్ పేరుతో కూడా డబ్బు వసూలు చేశారని ఈడీ ఆరోపిస్తోంది.