కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరానికి బెయిల్ వస్తుందా రాదా అన్న విషయం మరికాసేపట్లో తేలిపోతుంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసుకు సంబంధించి చిదంబరం పిటిషన్లపై సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ జరపనుంది.

ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో గత బుధవారం అరెస్టు అయిన చిదంబర సీబీఐ కస్టడీలో ఉన్నారు. సోమవారంతో ఈ కస్టడీ పూర్తవుతుంది. అయితే... ఈ అరెస్టును సవాలు చేస్తూ.. చిదంబరం తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 23వ తేదీన పిటిషన్ విచారణకు రాగా.. కస్టడీ వ్యవహారంపై ఇప్పుడు జోక్యం చేయబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

మరోవైపు ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం వ్యవహారంలో ఈడీ నుంచి రక్షణ కోరుతూ చిదంబరం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గతవారం విచారణ జరిపిన న్యాయస్థానం సోమవారం వరకు ఈడీ ఆయనను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రెండు కేసులపై మరికొద్ది సేపటిలో సుప్రీం కోర్టులో విచారణ  జరగనుంది.