న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ‌కు సుప్రీంకోర్టు మంగళవారం నాడు షాకిచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ .జస్టిస్  రంజన్ గొగోయ్, దీపక్ గుప్తా, జస్టిస్  అనురాధ బోస్ లతో కూడిన ధర్మాసనం ప్రజాప్రతినిథ్యం చట్టంలోని  125 సెక్షన్ కింద మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది.

తనపై ఉన్న అన్ని క్రిమినల్ కేసులను మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గతంలో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో  పొందుపర్చలేదని  సతీష్ ఊకే అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ నెల 21వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో  మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పై విచారణకు సుప్రీం అనుమతి ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

2018 డిసెంబర్  13వ తేదీన ఫడ్నవీస్  కు సంబంధించిన పెండింగ్ కేసులకు సంబంధించి పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్ పై బొంబాయి హైకోర్టు 2018 మే 3వ తేదీన క్లీన్‌చిట్ ఇచ్చింది. 

కానీ, సుప్రీంకోర్టు మాత్రం బొంబాయి హైకోర్టు ఆదేశాలతో విభేదించింది. ఈ కేసు విషయమై  మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పై విచారణకు  సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్‌పూర్  దక్షిణ-పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి ఫడ్నవీస్ పోటీ చేశారు.  నామినేషన్ దాఖలు చేసే సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో అన్ని కేసులను ప్రస్తావించలేదని  సతీష్ ఆరోపిస్తున్నారు. 

ఎన్నికలు ముగిసిన తర్వాత సతీష్ ఈ విషయమై  ప్రస్తావించారు. రెండు క్రిమినల్ కేసులను ఫడ్నవీస్ ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని  సతీష్  గుర్తు చేశారు.  ఇదే విషయమై సతీష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.