Jahangirpuri violence: జహంగీర్‌పూరి హింస వెనుక ఎన్నికల ప్రయోజనాలే కారణమని శివ‌సేన నాయ‌కుడు, పార్ల‌మెంట్ సభ్యులు సంజయ్ రౌత్ ఆరోపించారు. ఢిల్లీలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందేందుకు రాజధానిలో హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. 

Shiv Sena leader Sanjay Raut: ఇటీవ‌లి కాలంలో దేశంలో జ‌రుగుతున్న మ‌త ఘ‌ర్ష‌ణ‌ల ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. అయితే, ఈ మ‌త ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో ప‌లు వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్న కేంద్రంలోని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు పెద్ద‌గా చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే శివ‌సేన నాయ‌కుడు, పార్లమెంట్ స‌భ్యుడు సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌హంగీర్‌పూరి హింస వెనుక ఎన్నికల ప్రయోజనాలే కారణంగా ఉన్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల దాడి కొన‌సాగించారు. 

దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన మత ఘర్షణల సంఘటనలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఇలాగే మ‌త ఉద్రిక్త‌ల ప‌రిస్థితులు కొన‌సాగితే.. ఉక్రెయిన్‌, శ్రీలంక‌ల కంటే దారుణ‌మైన ఆర్థిక ప‌రిస్థితుల్లోకి భార‌త్ జారుకుంటుంద‌ని పేర్కొన్నారు. జహంగీర్‌పూరి ఘటనపై మాట్లాడుతూ ఢిల్లీలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందేందుకు రాజధానిలో హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. “అల్లర్ల కార‌ణంగా వాణిజ్యం మరియు ఉపాధి లేకుండా పోతుంది. ఇప్ప‌టికే శ్రామిక ప్రజల ఉపాధి క‌రువ‌వుతున్న‌ది. ఇప్పుడు దేశం ఆ సంక్షోభంలోకి దూకుతున్నట్లు కనిపిస్తోంది….భారత ఆర్థిక వ్యవస్థ శ్రీలంక మరియు ఉక్రెయిన్ స్థాయికి దిగజారిపోయే ప్ర‌మాద‌ముంది” అని ఆయన ఆరోపించారు.

దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో అల్లర్ల తరహా పరిస్థితిని సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంజ‌య్ రౌత్ ఆరోపించారు. “ఈ మత ఘర్షణలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. COVID-19 తర్వాత, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ప్రారంభించింది, అయితే కొంతమంది అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు” అని ఆయన ఆరోపించారు. "దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో అల్లర్ల వాతావరణాన్ని సృష్టించిన తీరు చాలా దురదృష్టకరం" అని పేర్కొన్నారు. “ఢిల్లీలో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి, ఆ ఎన్నికల్లో గెలవడానికి ఇదంతా చేస్తున్నారు. ముంబ‌యిలో కూడా అదే జరిగింది. ఇక్కడ లౌడ్ స్పీకర్ల సమస్య లేవనెత్తారు” అని ఆయ‌న అన్నారు. 

అంత‌కు ముందు కూడా దేశవ్యాప్తంగా రామనవమి మరియు హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన అనేక మతపరమైన హింసాత్మక సంఘటనలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడాన్ని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ప్రజలను శాంతింపజేయడానికి మ‌త సామరస్యం, ఐక్యత గురించి ప్రధానమంత్రి తప్పనిసరిగా మాట్లాడాలని అన్నారు. కాగా, గత శనివారం హ‌నుమాన్ జ‌యంతి ఊరేగింపు సందర్భంగా శనివారం సాయంత్రం దేశ రాజధానిలోని జహంగీర్‌పురి ప్రాంతంలో రాళ్లదాడి ఘటనలు జరగడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ మ‌త ఉద్రిక్త‌ల కార‌ణంగా ఎనిమిది మంది పోలీసుల‌తో పాటు అనేక మంది గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 23 మందిని అరెస్టు చేశారు. ఒక్క ఢిల్లీలోనే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల్లో శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.