గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం యావత్ సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయనతో అనుబంధం వున్న వారు బాలు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ముఖ్యంగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా సినీ ప్రపంచంలో విషాదం అలుముకుంది. లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం దాదాపు ఐదు దశాబ్ధాల పాటు దేశ ప్రజల్ని తన గాత్రంతో అలరించారు.

గత 50 రోజులుగా హాస్పటల్‌లో అనారోగ్యంతో పోరాడుతూ.. కరోనాను సైతం జయించిన ఎస్పీబీని ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Also Read:రేపు ఉదయం బాలు అంత్యక్రియలు: కుటుంబసభ్యుల ఏర్పాట్లు

ఆయన ఇకలేరనే వార్తలతో యావత్ దేశం విషాదంలో మునిగిపోయింది. దీంతో ఆయన అభిమానులు, ప్రజలు, పలువురు ప్రముఖులు బాలు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒరిస్సాలోని పూరీ తీరంలో ఇసుకతో బాలసుబ్రమణ్యం రూపాన్ని రూపొందించి ఆయనకు నివాళులర్పించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

శనివారం  ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్‌ సమీపంలోని తామరైపాకంలోని ఫామ్‌హౌస్‌లో బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.