సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అజమ్ ఖానుకు మరో షాక్ తగిలింది. గేదె దొంగిలించారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన అసిఫ్‌, జాకీర్‌ అనే వ్యక్తులు ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆయన తన అనుచరులతో కలిసి 2016 అక్టోబరు 15న రాంపూర్‌లోని ఇంటిని ధ్వంసం చేసి, అక్కడే ఉన్న గేదెను తీసుకెళ్లిపోయారని ఫిర్యాదు చేశారు.

దీంతో పాటు రూ.25 వేల నగదును కూడా దొంగిలించారని అసిఫ్‌, జాకీర్‌ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఇంటి స్థలం తనకు కావాలంటూ ఆజమ్‌ ఖాన్‌ తన అనుచరులతో వచ్చి తమపై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. నిజానికి ఆ స్థలం తమదే అయినప్పటికీ స్కూలు నిర్మించడం కోసం ఎంపీ తమపై ఒత్తిడి తెచ్చారన్నారు.

 అందుకు తగిన ధ్రువ పత్రాలు కూడా తమ వద్ద ఉన్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆజమ్‌ ఖాన్‌తో పాటు మాజీ అధికారి అలయ్‌ హసన్‌, మరో నలుగురి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో ఉంచారు. మరో 40 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను అందులో చేర్చారు.