వివక్ష 2000 ఏళ్ల నుంచి ఇంకా కొనసాగుతున్నది.. అది పోయేదాకా రిజర్వేషన్లు ఉండాల్సిందే: ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలనం
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో వివక్ష ఉన్నదని, అది కంటికి కనిపించదని, కానీ, వివక్ష ఉన్నదని స్పష్టం చేశారు. 2000 ఏళ్ల నుంచి కొన్ని వర్గాలు ఈ వివక్షకు గురవుతున్నారని, వారికి సమానత్వం వచ్చే వరకు రిజర్వేషన్లు అమలు కావాల్సిందేనని, రాజ్యాంగం చెప్పే రిజర్వేషన్లకు అన్నింటినీ ఆర్ఎస్ఎస్ సంపూర్ణంగా మద్దతు తెలుపుతుందని వివరించారు.
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో వివక్ష ఉన్నదని అన్నారు. ఈ అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని చెప్పారు. నాగ్‌పూర్‌లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నేటి యువతర వయోవృద్ధులు అయ్యేలోపు అఖండ భారత్ సాధ్యమేనని తెలిపారు. 1947 తర్వాత మన దేశం నుంచి విడిపోయిన వారు ఇప్పుడు తప్పును తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు.
మరాఠ కోటా కోసం ఆందోళనలు ఉధృతమైన సందర్భంలో మోహన్ భాగవత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రిజర్వేషన్లు ఉండాలని వారి గళానికి సారూప్యంగా కామెంట్ చేశారు.
‘మన తోటి మనుషులను మనం సామాజిక వ్యవస్థలో వెనుకే ఉంచాం. వారి గురించి పట్టించుకోలేదు. ఇది 2000 ఏళ్లపాటు కొనసాగింది. మనం వారికి సమానత్వాన్ని ప్రసాదించాలి. కొన్ని అవకాశాలు కల్పించాలి. అందులో ఒకటి ఈ రిజర్వేషన్లు. కాబట్టి, ఈ వివక్ష కొనసాగినంత కాలం రిజర్వేషన్లు కొనసాగాలి. రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ సమగ్రంగా మద్దతు పలుకుతున్నది’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కామెంట్ చేయడం సంచలనంగా మారింది.
‘మన సమాజంలో వివక్ష ఉన్నది. అది మన కంటికి కనిపించకపోవచ్చు. కానీ, వివక్ష ఉన్నది’ అని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్లు అంటే కేవలం ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసమే కాదు.. వారికి గౌరవం ఇవ్వడం కూడా అని వివరించడం గమనార్హం.
మన సమాజంలోని కొన్ని వర్గాలు 2000 ఏళ్లపాటు వివక్షకు గురైనప్పుడు మనం 200 ఏళ్లపాటు సమస్యను ఎందుకు అంగీకరించకూడదు అని అన్నారు.
Also Read: Bharat: ఇండియాకు బదులు భారత్ పేరునే వాడండి: ఆర్ ఎస్ ఎస్ చీప్ మోహన్ భాగవత్
ఓ విద్యార్థి అఖండ్ భారత్ ఎప్పుడు ఉనికిలోకి వస్తుందని ప్రశ్నించగా.. ‘మీరు ఇప్పటి నుంచి పని చేస్తే మీరు వృద్ధులు అయ్యేలోపే వస్తుంది. ఎందుకంటే భారత్ నుంచి విడిపోయిన వారు ఇప్పుడు బాధపడుతున్నారు. వారు మళ్లీ ఇండియాలో భాగం కావాలని అనుకుంటున్నారు. ఆ సరిహద్దును రూపుమాపితే చాలు అన్నట్టుగా వారు భావిస్తున్నారు. కానీ, కాదు. ఇండియ స్వభావాన్ని అంగీకరించినప్పుడే ఇండియన్లు అయినట్టు.’ అని మోహన్ భాగవత్ వివరించారు.
150 నుంచి 2002 వరకు హెడ్‌క్వార్టర్స్ మహల్ ఏరియాలో జాతీయ పతాకాన్ని ఎగరేయ లేదనే వాదనలను మరో విద్యార్థి ప్రస్తావించగా.. అవి తప్పు అని కొట్టిపారేశారు. తాము ఆగస్టు 15, జనవరి 26లకు జాతీయ జెండాను ఎగరేస్తామని వివరించారు.