NeoCoV పై ఆందోళన అవసరమా ? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే ?
ఇప్పటికే కోవిడ్ -19 అల్ఫా, డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లతో సతమతమవుతున్నామంటే ? మళ్లీ ఇప్పుడు ఓ కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త NeoCoV వైరస్ పై ప్రజల్లో ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. అయితే దీనిపై ప్రస్తుతానికి ఆందోళనలు అవసరం లేదని శాస్త్రవేత్లలు చెబుతున్నారు.
కరోనా వైరస్ ఏ సమయంలో మానవులను సోకిందో కానీ.. ఇంకా అది మనల్ని విడిచి పెట్టి వెళ్లడం లేదు. దాని రూపాలు మార్చుకుంటూ మన చుట్టూనే తిరుగోతోంది. 2019లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ కుటుంబానికి చెందిన కోవిడ్ -19 మనుషులకు సోకింది. తరువాత ఆల్ఫా. డెల్టా, ఒమిక్రాన్ పేరు ఏదైతేనేం మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడున్న వైరస్ లతోనే మనం సతమతమవుతున్నాం అంటే మళ్లీ కొత్త వైరస్ బయటపడింది. ఇది కూడా కరోనా కుటుంబానికి చెందినదే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి దీనిని NeoCoV అని పిలుస్తున్నారు.
ఈ NeoCoV వైరస్ బయటపడిందని తెలియగానే.. దీనిపై విపరీతంగా చర్చ జరుగుతోంది. ప్రతీ ముగ్గురులో ఒకరు చనిపోతారని అధ్యయనాలు చెబుతున్నాయని కథనాలు వెలువడ్డాయి. దక్షిణాఫ్రికాలో ఈ కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇది మనుషులకు సోకితే వేగంగా వ్యాపిస్తుందని, మరణాలు కూడా అధిక సంఖ్యలో ఉంటాయని చైనాలోని వ్యూహాన్ సైంటిస్టులు హెచ్చరించారు. దీంతో ఈ వారం మొత్తంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆన్ లైన్ లో ఈ కొత్త వైరస్ గురించి చాలా మంది వెతికారు. గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం (జనవరి 28) చివరి నాటికి, 'NeoCoV' ఐదు లక్షల కంటే ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఇండియాలో అత్యధిక మంది గూగుల్ చేసిన పదంగా మొదటి స్థానంలో నిలిచింది. అయితే నిజంగానే ఈ NeoCoV వైరస్ మనుషులకు సోకుతుందా ? ఈ కొత్త వైరస్ తో ఎంత ప్రమాదం ఉంది ? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు. ? ఈ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
NeoCoV అంటే ఏమిటి?
NeoCoV అనేది MERS-CoVకి చెందిన వేరియంట్ ను విరివిగా ఉపయోగిస్తున్న పదం. MERS-CoV అనేది కరోనా వైరస్ కుటుంబానికి చెందినది. ఇప్పటి వరకు మనుషులకు సోకుతుందని తెలిసిన ఏడు కరోనా వైరస్ లలో ఇది కూడా ఒకటి. MERS-CoV 2010 సంవత్సరంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణ కొరియాలో పెద్ద ఎత్తున వ్యాప్తి చెందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, MERS-CoV సోకిన రోగుల్లో సుమారు 35 శాతం మంది మరణించారు. ఇప్పటి NeoCoV అనేది ఈ వైరస్ కు చెందిన వేరియంట్.
NeoCoV రీసెర్చ్ పేపర్లు ఏం చెబుతున్నాయి ?
NeoCoV అనేది MERS-CoVకి అత్యంత దగ్గరగా ఉన్న వేరియంట్. దీనిని గబ్బిలాలో గుర్తించారు. T510F మ్యుటేషన్ తర్వాత NeoCoV మానవ ACE2 కణాలకు సోకుతుంది. పరిశోధన పత్రాలు సారాంశం ఏం చెబుతున్నాయంటే.. ఇప్పటివరకు గబ్బిలాలలో మాత్రమే కనుగొనబడిన నియోకోవి వైరస్ ను గుర్తించారు. ఇది ఒక నిర్దిష్ట రకమైన మ్యుటేషన్‌కు గురైతే మాత్రమే మానవులకు సోకే అవకాశం ఉంది. కానీ ఇది చాలా అరుదుగా జరగవచ్చు. వ్యూహాన్ శాస్త్రవేత్తలు విడుదల చేసిన నివేదకలు ఇంకా పీర్-రివ్యూ చేయని ప్రయోగశాల అధ్యయనాలు మాత్రమే. వాటి ఆధారంగా మనుషులకు సోకుతుందని ఇప్పటికి భావించలేము. ఇంత వరకు మనుషులకు సోకినట్టు కూడా ఎలాంటి రుజువులు లేవు. అయితే ప్రస్తుతం వరకు ఉన్న అధారాల ప్రకారం.. మనుషులకు సోకే అవకాశం మాత్రం ఉంది.