కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారిన దేశంలో ప్రతిరోజూ వేల మంది పడుతున్నారు. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రజలకు ఈ వైరస్ పట్ల అవగాహన కల్పించాల్సిన వైద్యులే విచ్చలవిడిగా ప్రవర్తించారు. కరోనా నియమాలను తుంగలో తొక్కి.. పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూణేలో కరోనా విజృంభిస్తున్న సమయంలో  కొంతమంది వైద్యులు బర్త్‌డే పార్టీ చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు 11మంది డాక్టర్లపై కేసు నమోదుచేశారు. అలాగే ఇద్దరు రిసార్ట్ మేనేజర్లను కూడా అరెస్టు చేశారు. 

 కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్న కారణంగా పూణేలో పదిరోజులపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఆదేశాలను పక్కనబెట్టిన వైద్యులు శుక్రవారంనాడు బర్త్‌డే పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. ‘లాక్‌డౌన్‌లో మూసేసి ఉండాల్సిన రిసార్టు అర్థరాత్రి తెరిచారని, దానిలో కొందరు వ్యక్తులు చేరి పార్టీ చేసుకుంటున్నారని సమాచారం అందింది. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం’ అని పోలీసులు తెలిపారు.