న్యూఢిల్లీ: రాజ్యసభలో ట్రిపుల్ బిల్లును కేంద్ర మంత్రి రవిశంకర్ మంగళవారం నాడు ప్రవేశపెట్టారు. ఇప్పటికే లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందింది. గత టర్మ్‌లో  ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందలేదు.  ఈ బిల్లుపై ఎటూ తేల్చని పార్టీలు 18 ఉన్నాయి.ఈ పార్టీలపైనే బీజేపీ ఆశతో ఉంది.

పేద ముస్లింల మహిళలకు న్యాయం చేయడం కోసమే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. ఈ బిల్లుపై చర్చసాగుతోంది.రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 121 మంది ఎంపీలు ఓటు చేయాలి. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏకు 113 మంది సభ్యులున్నారు.రాజ్యసభలో యూపీఏ బలం 68.

ఈ బిల్లుకు బీజేడీ, వైఎస్ఆర్‌సీపీ మద్దతు ఇస్తే ఎన్డీఏకు 116 ఓట్లు వస్తాయి. జేడీయూ, టీఆర్ఎస్ 6, అన్నాడిఎంకె 12 మంది ఎంపీలు ఉన్నారు. జేడీ(యూ), టీఆర్ఎస్,  అన్నాడీఎంకెలు ఈ బిల్లుకు దూరంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

రాజ్యసభలో వాస్తవ సభ్యుల సంఖ్య 245. అయితే ప్రస్తుతం రాజ్యసభలో 241 మంది మాత్రమే ఉన్నారు. అయితే  ట్రిపుల్ తలాక్ బిల్లుకు టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ ఏం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఆర్టీఐ చట్టసవరణ బిల్లు విషయంలో టీఆర్ఎస్ వ్యతిరేకించింది. అమిత్ షా రంగంలోకి దిగి కేసీఆర్ కు ఫోన్ చేశాడు. దీంతో ఆర్టీఐ చట్ట సవరణ బిల్లుకు టీఆర్ఎస్ చివరినిమిషంలో ఆమోదం తెలిపింది. తెలంగాణలో ముస్లిం జనాభా గణనీయంగా ఉంటుంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్ధుల గెలుపు ఓటములను  ముస్లిం ఓటర్లు ప్రభావితం చేస్తారు.

మరోవైపు టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉన్నఎంఐఎం ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ తరుణంలో  కేసీఆర్ ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో ఏ నిర్ణయం తీసుకొంటారోననేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

ఇక ఏపీలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ముస్లిం ఓటర్లు గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారు. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో వైఎస్ఆర్‌సీపీ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందోనని పలువురు ఆసక్తిగా చూస్తున్నారు.