సొంత పార్టీ నాయకురాలైన ఓ యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఆశచూపించి ఓ రాష్ట్ర స్థాయి నాయకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నాయకులు, కార్యకర్తలు ఎంతో పవిత్రంగా భావించే పార్టీ కార్యాలయంలోనే ఈ  ఘాతుకానికి పాల్పడటం మరీ దారుణం. ఈ సంఘటన ఉత్తరాఖండ్ బిజెపి కార్యాలయంలో చోటుచేసుకుంది.

ఈ దారుణానికి సంబంధించి బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరా ఖండ్ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అదే పార్టీకి చెందిన ఓ యువతి పోలీసులకు పిర్యాదు చేసింది. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపించి తనను లోబర్చుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఎన్ని రోజులు ఎదురుచూసినా సంజయ్ కుమార్ ఉద్యోగం ఇప్పించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన యువతి చివరకు పోలీసులను ఆశ్రయించింది. 

ఉత్తరాఖండ్ రాజధాని  డెహ్రాడూన్ నగరం బల్బీర్ రోడ్డులోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే తనపై సంజయ్ కుమార్ అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఇలా పార్టీ  నాయకులు, కార్యకర్తలతో ఎప్పుడూ బిజీగా వుండే కార్యాలయాన్నే సదరు నేత తన కామక్రీడలకు నిలయంగా మార్చుకోవడం బిజెపి కార్యకర్తలో ఓ వైపు ఆశ్చర్యాన్ని కల్గించడంతో పాటు ఆగ్రహాన్ని పెంచింది.  
 
బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బిజెపి పార్టీ  కూడా సంజయ్ కుమార్ పై చర్యలు తీసుకుంది. ఆయన్ని ప్రధాన కార్యదర్శి పదవినుండి తొలగిస్తున్నట్లు ఉత్తరాఖండ్ బిజెపి ప్రకటించింది.