రామేశ్వరం కేఫ్ పేలుడు.. ప్రధాన నిందితుడి సహచరుడు అరెస్ట్..
రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడి సహచరుడిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. అతడిని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
బెంగళూరులోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక డెవల్ మెంట్ చోటు చేసుకుంది. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఓ వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం అరెస్టు చేసింది. పేలుళ్లు జరిగిన మార్చి 1న బళ్లారి బస్టాండ్ లో సయ్యద్ షబ్బీర్ అనే వ్యక్తి ఈ కేసులో ప్రధాన నిందితుడిని కలిశాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ కేసులో ఆయనను విచారిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వ్యక్తి అతడేనా అనేది ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశామని, ఇది ఓ కొలిక్కి రాబోతోందని కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
కాగా.. మార్చి 6న ఐసిస్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో నలుగురు వ్యక్తులను ఎన్ ఐఏ అదుపులోకి తీసుకుంది. కొన్ని రోజుల క్రితం ప్రధాన నిందితుడు మాస్క్ ధరించి నడుస్తున్న కొత్త చిత్రాలను ఎన్ఐఏ విడుదల చేసింది. అందులో టోపీ లేకుండా కొత్త డ్రెస్ లో నిందితుడు కనిపించినా మాస్క్ మాత్రం ఇంకా పెట్టుకునే కనిపించాడు. తుమకూరు వెళ్లే మార్గంలో బస్సు దిగి ఉంటాడని భావిస్తున్నారు. ప్రధాన నిందితుని గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.10,000 నగదు బహుమతిని ఇప్పటికే ఎన్ఐఏ ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు బళ్లారి చేరుకునే ముందు రెండు అంతర్రాష్ట్ర ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించినట్లు సమాచారం. అక్కడి నుంచి మరో బస్సులో ఇంకా తెలియాల్సిన ప్రదేశానికి వెళ్లినట్లు ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ తెలిపింది. మార్చి 1న బ్రూక్ ఫీల్డ్ ఔట్ లెట్ లో పేలుడు సంభవించడంతో వినియోగదారులు, హోటల్ సిబ్బంది గాయపడ్డారు. ఈ కేసును మార్చి 3న ఎన్ఐఏకు అప్పగించారు. బెంగళూరు పోలీసుల సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) సహకారంతో దర్యాప్తు చేస్తున్నారు.