కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గంగారామ్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి, సోనియా గాంధీని రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గంగారామ్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి, సోనియా గాంధీని రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఎదుట విచారణకు హాజరైన రాహుల్ గాంధీ.. భోజన విరామం నిమిత్తం బయటకు వచ్చారు. ఈడీ కార్యాలయం నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. కొద్దిసేపటికే ఇంట్లో నుంచి బయలుదేరి గంగరామ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోనియాను పరామర్శించేందుకు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి రాహుల్ గాంధీ.. తిరిగి ఈడీ కార్యాలయానికి హాజరుకానున్నారు. మరో విడత ఈడీ అధికారులు.. రాహుల్ గాంధీని ప్రశ్నించనున్నారు. 

అంతకుముందు మూడు గంటల పాటు ఈడీ అధికారులు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్‌ ఇండియా లిమిటెడ్‌తో రాహుల్‌కు సంబంధాలు, ఆయన పేరుపై ఉన్న షేర్ల వివరాలు, గత షేర్‌ హోల్డర్లతో సంబంధాలు,యంగ్‌ ఇండియాకు కాంగ్రెస్‌ రుణాలు, నేషనల్ హెరాల్డ్ పునరుద్ధరణపై కాంగ్రెస్‌ నిర్ణయం, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులు, నిధుల బదిలీల వివరాలను ఈడీ అడిగినట్లు సమాచారం.

ఇక, కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డ సోనియా గాంధీ.. ఆదివారం ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. ‘‘కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కొవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమె కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు.

ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరనస
రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బీజేపీ ఇలాంటి చర్యలు మానుకోవాలని లేకుంటే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబంపై ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారంటే.. బీజేపీ ఎంత కక్ష పూరితంగా వ్యవరిస్తుందో తెలుస్తుందని అన్నారు. ఈడీ కార్యాలయం నుంచి రాహుల్ గాంధీ బయటకు వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు. 

రాహుల్‌ను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో.. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరసలు చేపట్టింది. ఢిల్లీలో పలువురు ముఖ్య నేతలతో పాటుగా, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలను పోలసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించబడిన కాంగ్రెస్ కార్యకర్తలను ప్రియాంక గాంధీ కలిశారు.