ఆర్ధిక సంస్కరణల ఆధ్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు 98వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులర్పించారు. ‘‘ ఓ గొప్ప విద్యావేత్త, అనుభవజ్ఞుడైన పరిపాలకుడు, కష్టకాలంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించారు.

ఒక గొప్ప అడుగు వేసేందుకు, దేశ అభివృద్ధిలో ఆయన ఎప్పుడూ గుర్తుండిపోతారన్నారు. పాలనా వ్యవహారాల్లో దిగ్గజ నేతగా పేరొందిన పీవీ దేశాన్ని సంక్లిష్ట పరిస్థితుల నుంచి అత్యంత చాకచక్యంగా ముందుకు నడిపారని.. ఆయన చేపట్టిన చర్యలు దేశ పురోగతికి బాటలు వేశాయని మోడీ ట్వీట్ చేశారు.

మరో వైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లు కూడా పీవీకి నివాళులర్పించారు. ఇక నరసింహారావు సొంతపార్టీ కాంగ్రెస్ కూడా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించింది.

గొప్ప దార్శినికుడు, ఆర్ధిక సంస్కరణల రూపశిల్పి అయిన పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. దేశ అభివృద్ధికి అవరోధంగా నిలిచిన లైసెన్స్ రాజ్‌ను తొలగించడంతో పాటు సంస్కరణలతో ఆర్ధిక వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించారంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

మరోవైపు మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల కర్త అయిన పీవీ నరసింహారావుకు తగిన గుర్తింపు ఇవ్వలేదని.. అన్యాయం చేశారంటూ ఆయన మనవడు ఎన్‌వీ సుభాష్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.

గాంధీ కుటుంబానికి పీవీ ఎంతో చేశారని... ఎన్నో సందర్భాల్లో వారికి సరైన సలహాలు ఇచ్చి గైడ్‌లా వ్యవహరించారని తెలిపారు. పార్టీకి విధేయుడిగా ఉన్న పీవీని నెహ్ర-గాంధీ కుటుంబం ఘోరంగా అవమానించిందని... చివరకు ఆయన భౌతిక కాయాన్ని సైతం ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయం లోపలికి అనుమతించలేదన్నారు.

బాబ్రీ మసీదు కూల్చివేత వల్లే ముస్లింలు కాంగ్రెస్‌కు దూరమయ్యారని.. అందుకే గాంధీ కుటుంబం పీవీని పక్కనబెట్టిందన్న చిన్నారెడ్డి ఆరోపణల్లో వాస్తవమెంత..? అని సుభాష్ ప్రశ్నించారు.

బాబ్రీ కూల్చివేతతో కాంగ్రెస్‌కు ముస్లింలు దూరమైతే 2004 నుంచి 2014 వరకు పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందని సుభాశ్ ప్రశ్నించారు. పీవీకి జరిగిన అవమానంపై సోనియా, రాహుల్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.