Punjab Assembly Election 2022: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా ప్రస్తుత సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీనే ముఖ్యమంత్రిగా ఉంటారని కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత.. పంజాబ్ మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. చ‌న్నీని ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించి కాంగ్రెస్ పెద్ద త‌ప్పు చేసింద‌నీ, సీఎంను  సామర్థ్యం ఆధారంగా నిర్ణయించుకోవాలి తప్ప కులం ఆధారంగా కాదంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.  

Punjab Assembly Election 2022: ఈ నెల‌లో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు వేడెక్కాయి. ఈ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అన్ని ప్ర‌ధానపార్టీలు పంజాబ్ లో ఎన్నిక‌ల ప్రచారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతుండ‌టంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. అయితే, ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ... అన్ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారంలో ముందుకు సాగుతున్నాయి. ఇదిలావుండ‌గా, గ‌త కొంత కాలంగా పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి గురించి చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, రెండు రోజుల క్రితం సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌స్తుత రాష్ట్ర ముఖ్య‌మంత్రి చ‌ర‌ణ్ జీత్ సింగ్ చ‌న్నీ (Charanjit Singh Channi) కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. 

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా ప్రస్తుత సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీనే ముఖ్యమంత్రిగా ఉంటారని కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత.. పంజాబ్ మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. చ‌న్నీని ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించి కాంగ్రెస్ పెద్ద త‌ప్పు చేసింద‌నీ, సీఎంను సామర్థ్యం ఆధారంగా నిర్ణయించుకోవాలి తప్ప కులం ఆధారంగా కాదంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. చరణ్‌జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందని, ముఖ్యమంత్రిగా సామర్థ్యం ఆధారంగా నిర్ణయించుకోవాలి తప్ప కులం ఆధారంగా కాద‌ని అన్నారు. పంజాబ్ ఇంతకు ముందెన్నడూ కుల లేదా మత ప్రాతిపదికన విభజించబడలేదనీ, చన్నీకి ముఖ్యమంత్రి స్థాయి లేదని, అతని పెద్ద వాదనలు రాష్ట్ర ప్రజలను మోసం చేయలేవని పేర్కొన్నాడు.

111 రోజుల్లో అన్నీ చేశానని చన్నీ చెప్పాడు. ప్రజలను మోసం చేస్తున్నాడు. ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రారంభించడానికి నెలల సమయం పడుతుందనీ, ఇలాంటి అబద్ధాలకు దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించాడు. చన్నీ చెప్పిన ప్రాజెక్టులన్నీ ఆయన (అమరీందర్) ప్రభుత్వం ప్రారంభించినవేనని అన్నారు. అలాగే, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ నుంచి వ్య‌తిరేక‌త రావ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. కాంగ్రెస్ లో సీఎం పీఠం కోసం సిద్దూ పోటీ పడుతున్నార‌ని అమ‌రీంద‌ర్ సింగ్ పేర్కొన్నారు. చన్నీ, డిప్యూటీ సీఎం సుఖ్‌జీందర్ రాంధావా వంటి నేతలు తమ రాజకీయ జీవితంలో తమకు మద్దతు ఇచ్చిన తర్వాత తనను వెన్నుపోటు పొడిచారని, కాంగ్రెస్ హైకమాండ్‌ను తప్పుదోవ పట్టించారని ఆరోపించిన అమరీందర్, ఈ వ్యక్తులను నమ్మలేమని అన్నారు. తమ ప్రయోజనాల కోసం పంజాబ్ ప్రయోజనాల విషయంలో రాజీ పడతారని కూడా ఆయ‌న హెచ్చరించారు.

రాజకీయ, ప్రజా జీవితానుభవానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీకి మధ్య ఎలాంటి పోలిక లేదని ఆయన అన్నారు. మోడీ తనకు చాలా కాలంగా తెలుసుననీ, వారిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఆయనను తరచూ ఢిల్లీలో కలుస్తుండేవారని, పంజాబ్ ఆపదలో ఉన్నప్పుడల్లా మోడీ ప్రభుత్వం తనకు సాయం చేసిందని అమ‌రీంద‌ర్ చెప్పుకొచ్చారు. పంజాబ్‌కు సురక్షితమైన భవిష్యత్తు ఉండేలా వారితో కలిసి పని చేయాలని ఆయన అన్నారు. పంజాబ్ భవిష్యత్తు రాబోయే ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర-రాష్ట్ర సమన్వయం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. తన సతీమణి, ఎంపీ ప్రణీత్ కౌర్ తన తరపున ప్రచారం చేస్తారా లేక కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారా అనేది ఆమె నిర్ణయించుకోవాలని అమరీందర్ అన్నారు.