పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ ఎమ్మెల్యేగా గెలుపొందలేరని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. తమ పార్టీ నిర్వహించిన సర్వేలో చన్నీ రెండు స్థానాల్లోనూ ఓడిపోతున్నట్టు తేలిందని చెప్పారు. 

punjab election news 2022 : పంజాబ్ (punjab) ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ (Charanjit Singh Channi) పోటీ చేస్తున్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఓడిపోతారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (aam admi party) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్ (arvind kejriwal) అన్నారు. పంజాబ్ ఎన్నిక‌ల సందర్భంగా ఆయ‌న అమృత్‌సర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ‘‘ చమ్‌కౌర్ సాహిబ్, బదౌర్ అనే రెండు స్థానాల నుండి చన్నీ పోటీ చేస్తున్నారు. మేము మూడుసార్లు సర్వే చేశాము. చన్నీ సాహెబ్ రెండు స్థానాల నుండి ఘోరంగా ఓడిపోతున్నారు ’’ అని ఆయ‌న తెలిపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చమ్‌కౌర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి 52 శాతం ఓట్లు వస్తాయని అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. చ‌రణ్ జిత్ చ‌న్నీకి 35 శాతం ఓట్లు వస్తాయని తెలిపారు. బదౌర్‌లో ఆప్‌కి 48 శాతం ఓట్లు రాగా, చన్నీకి 30 శాతం ఓట్లు వస్తాయని త‌మ స‌ర్వే తెలిపింద‌ని చెప్పారు. ‘‘ ఆయ‌న (చన్నీ) ఎమ్మెల్యే కానప్పుడు, ముఖ్యమంత్రి ఎవ‌రు అవుతారు? ’’ అని కేజ్రీవాల్ ప్ర‌శ్నించారు. 

ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇసుక అక్ర‌మ తవ్వకాలపై తమ పార్టీ సీఎం భగవంత్ మాన్ ‘న్యాయమైన విచారణ’ చేస్తారని అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. “ చన్నీ స్వయంగా విచారణ జరిపించాడు. డబ్బు అంతా చన్నీడిదేనని అతని బంధువు ఒప్పుకున్నప్పుడు. ED అతన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు? భగవంత్ మాన్ సీఎం కాగానే ఇసుక తవ్వకాలపై న్యాయమైన విచారణ జ‌రిపిస్తాడు ’’ అని ఆయ‌న అన్నారు. 

చమ్‌కౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గంలో వ‌చ్చిన అక్రమ మైనింగ్ (mining)ఆరోపణలపై చ‌ర‌ణ్ జిత్ సింగ్ చన్నీకి శనివారం క్లీన్ చిట్ లభించింది. క్లీన్ చిట్ పొందిన తర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్‌ను ‘‘అబద్ధాలకోరు’’ అని విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ అబద్దాల అని, త‌న‌పై పలు ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించార‌ని అన్నారు. కానీ అందులో ఏ ఒక్క‌టీ నిజం కాలేదు. గవర్నర్‌కు త‌న‌పై ఫిర్యాదు చేశార‌ని తెలిపారు. అయితే గ‌వ‌ర్న‌ర్ విచారణకు ఆదేశించార‌ని, కానీ నిజ‌మే గెలుస్తుంద‌ని చెప్పారు. ‘‘ బ్రిటీష్ వారు భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. అదే విధంగా కేజ్రీవాల్ అతని ఢిల్లీ కుటుంబం రాఘవ్ చద్దా, ఇతర బయటి వ్యక్తులు పంజాబ్‌ను దోచుకోవడానికి వచ్చారు. అయితే మొఘలులు, బ్రిటీష్‌లకు చేసినట్లుగానే పంజాబ్ వారి స్థానాన్ని వారికి చూపుతుంది ’’ అని ఆయ‌న అన్నారు. 

ఇది ఇలా ఉండ‌గా.. అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించి చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ (bhupinder singh honey) శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. అతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఫిబ్రవరి 3న జలంధర్‌లో అక్రమ ఇసుక తవ్వకాల కేసులో హనీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఈ త‌రుణంలో హనీ పై దాడులు నిర్వహించి.. అతని నుంచి ₹ 7.9 కోట్ల ఆస్తిని, మరో నిందితుడు సందీప్ కుమార్ నుండి ₹ 2 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకుంది. కాగా పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల‌కు ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. మార్చి 10వ తేదీన ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు.