పంజాబ్‌లో రాజకీయం రసకందాయంగా మారుతున్నది. పంజాబ్ సీఎంగా దళితుడు చన్నీ బాధ్యతలు స్వీకరించడానికి చాలా మంది ఇప్పటి భావిస్తున్నారు. కానీ, చన్నీ క్రైస్తవ మతంలోకి మారి ఉండవచ్చని ఓ సిక్కు నేత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఓ ఇంటర్వ్యూలో చన్నీ మాట్లాడుతూ కొందరు సిక్కులకు ప్రేమ లభించక క్రైస్తవ మతాన్ని ఎంచుకుని ఉండవచ్చని, అది న్యాయబద్ధమైన నిర్ణయమేనని వ్యాఖ్యానించారని ఆ నేత పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బాధాకరం అని అన్నారు.

చండీగడ్: పంజాబ్‌(Punjab)లో ఎస్సీ సంఖ్య అధికంగా ఉంటుంది. దేశంలోని ఏ ఇతర రాష్ట్రానికంటే కూడా ఇక్కడ దళితుల సంఖ్య అధికం. ఈ ఈక్వేషన్ బహుశా చరణ్ జిత్ సింగ్ చన్నీని సీఎంగా ఎంచుకోవడానికి కాంగ్రెస్‌ను ప్రభావితం చేసి ఉండొచ్చు. దళిత నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ(Charanjit singh Channi)ని సీఎంగా చేస్తే పార్టీ అనుకూలత మరింత పెరగవచ్చని భావించి ఉండొచ్చు. కానీ, కాంగ్రెస్ ఆలోచనల పునాదిని దెబ్బ తీసేలా ఓ సిక్కు నేత సంచలన ఆరోపణలు చేశారు. సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ మత మార్పిడి(Conversion) చేసుకుని ఉండొచ్చని అన్నారు. ఆయన క్రైస్తవ మతం (Christianity)స్వీకరించి ఉండవచ్చని ఆరోపించారు. 

సిక్కు నేత మంజిందర్ సింగ్ సిర్సా ఈ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. చరణ్ జిత్ సింగ్ చన్నీ ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవని ఆయన తన వీడియో మొదలుపెట్టారు. సిక్కులు మత మార్పిడిని ఆయన ధ్రువీకరించారని, అంతేకాదు, అది సరైన నిర్ణయంగానే సమర్థించడం దారుణమని పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలోని సిక్కులకు అత్యంత దుఖభరితమైన, బాధాకరమైన విషయం అని అన్నారు. తమ ప్రజలు వారికి ప్రేమను ఇవ్వలేకపోయారేమో.. అందుకే వారు క్రైస్తవ మతంలోకి మారి ఉండవచ్చని స్వయంగా ఒక సిక్కు సీఎం వ్యాఖ్యానించడం సమర్థనీయం కాదని విమర్శించారు. గురు గోబింద్ జీ శ్లోకాన్ని పేర్కొని మత మార్పిడిని న్యాయమేనని పేర్కొనడం, వారికి ప్రేమ ఇవ్వలేదని, అందుకే వారు తమ సిక్కు ధర్మాన్ని వదిలిపెట్టారని, క్రైస్తవ మతాన్ని ఎంచుకున్నారని చెప్పడం దురదృష్టకరమని అన్నారు.

Scroll to load tweet…

సీఎం చన్నీ కేవలం ఎన్నికల కోసం ఇంతలా దిగజారిపోవడం బాధాకమరం అని మంజిందర్ సింగ్ సిర్సా అన్నారు. ఇది సిగ్గు చేటు అని విమర్శించారు. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత తనలోనూ కొన్ని అనుమానాలు వచ్చాయని అన్నారు. ఇప్పటికే చాలా మంది చరణ్ జిత్ సింగ్ చన్నీ సిక్కు ధర్మాన్ని వదిలి పెట్టారని, క్రిస్టియానిటీని ఎంచుకున్నారనే ఆరోపణలు చాలా వచ్చాయని, ఈ వ్యాఖ్యల తర్వాత ఆ ఆరోపణలు నిజమేనేమో అనే అభిప్రాయాలు తనలో వస్తున్నాయని వివరించారు. బహుశా సీఎం చన్నీ కూడా క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఉండవచ్చని, అందుకే ఆయన మనసులోని ఆ విశ్వాసాలే ఈ విధంగా వ్యాఖ్యానించడానికి ప్రేరేపించి ఉండవచ్చని అనుకుంటున్నట్టు తెలిపారు. ఒక సిక్కు వ్యక్తి సిక్కుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మత మార్పిడి గురించి సమర్థిస్తూ మాట్లాడటం సిక్కులందరికీ దౌర్భాగ్యకరమని అని పేర్కొన్నారు.