పూణే: మహారాష్ట్రలోని పూణేలో చెత్తలో పాత పర్సును పడేసిన మహిళకు ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది. చివరకు ఆ మహిళ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పనికి రానివాటిని పడేస్తూ వచ్చింది. అందులో ఓ పాత పర్సు కూడా ఉంది. 

అయితే, ఆ పాత పర్సులో రూ.3 లక్షల విలువ చేసే ఆభరణాలు ఉన్నట్లు తర్వాత గుర్తుకు వచ్చింది. చివరకు దాన్ని ఆమె పొందగలిగింది. రేఖ సులేకర్ అనే మహిళ పాత హ్యాండ్ బ్యాగ్ ను చెత్తను సేకరించే వ్యాన్ ఘంటా గాడిలో వేసింది. కొన్ని గంటల తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకుంది. 

వెంటనే ఆమె కుటుంబ సభ్యులు పీసీఎంసీ ఆరోగ్యాధికారులను సంప్రదించారు. డంపింగ్ యార్డుకు వెళ్లాల్సిందిగా అధికారులు వారికి సూచించారు. బ్యాగ్ కోసం పీసీఎంసీ ఆరోగ్య శాఖ అధికారులు 18 టన్నుల చెత్తలో గాలించారు. 

పింపిరి- చించ్ వాడ మున్సిపల్ కార్పోరేషన్ (పీసీఎంసీ) అధికారులు దాదాపు గంట పాటు చెత్తనంతా కెలికి చివరకు బ్యాగ్ ను కనిపెట్టారు. అందులోని విలువైన వస్తువులు కూడా బయటకు వచ్చాయి. చివరకు ఆ బ్యాగ్ యజమానికి చేరింది.