హర్యాణాలో ఓ పూజారి దారుణానికి తెగబడ్డాడు. పూజలు చేసి కష్టాలు తొలగిస్తానని నమ్మించి ఓ యువతి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. దాన్నంతా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. 

హరియాణా : జీవితంలో కష్టాలు పోగొట్టుకోవడానికి చాలామంది రకరాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు పూజలు, శాంతులు చేసి కష్టాల నుంచి గట్టెక్కాలని అనుకుంటారు. అలా అనుకోవడమే ఒక యువతి పాలిట శాపమయ్యింది. పూజలు చేస్తానని చెప్పిన పూజారి.. ఆమెను బలాత్కరించి, తన అకృత్యాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఈ ఘటన హరియాణాలోని హిసార్ జిల్లాలో వెలుగు చూసింది. 

సదరు పూజారి పేరు నరేష్. హిసార్ లోని ఆజాద్ నగర్ లో స్థలం కొన్న నరేష్. అక్కడ ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆజాద్ నగర్ వచ్చినప్పుడు బాధితురాలి ఇంటికి వచ్చేశాడు. ఆ కుటుంబంలో భర్త సీఆర్ పీఎఫ్ జవానుగా వేరే రాష్ట్రంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తల్లీ కూతుళ్లను దగ్గర్లోని ఆలయానికి తీసుకువెళ్లి అతను.. వారి జీవితాల్లో కొన్ని కష్టాలు ఉన్నాయని, అవి తొలగిపోవాలంటే పూజలు చేయాలని చెప్పాడు. ఈ కారణంలో ఆ ఇంటికి తరచూ వస్తూ.. యువతి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. 

తను చేసిన పాడుపనిని వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. అలాగే పూజల పేర్లు చెప్పి రూ.1.15 లక్షలు కాజేశాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. అలాగే కొన్ని నగలు కూడా తీసుకున్నట్లు వాపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు పూజారి నరేష్ మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. 

ఇదిలా ఉండగా నిరుడు జూన్ లో ఇలాంటి దొంగబాబా కేసు ఒకటి ఉత్తరప్రదేవశ్ లో వెలుగులోకి వచ్చింది. రహస్యంగా ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఐదుగురిని వివాహం చేసుకోవడమే కాక వారికి విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లికి సిద్ధమైన దొంగ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలు…ఉత్తర ప్రదేశ్ షహనాజ్ పూర్ కు చెందిన అనూజ్ చేతన్ కథేరియా అనే వ్యక్తికి 2005లో మొదటిసారి వివాహం అయింది. పెళ్లి తర్వాత భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండడంతో ఆమె అతడి నుంచి విడిపోయి వేరుగా ఉంటుంది. ప్రస్తుతం వీరి విడాకుల కేసు ఇంకా కోర్టులోనే ఉంది. 

ఇదిలా ఉండగానే 2010లో అనూజ్ రెండో వివాహం చేసుకున్నాడు. కొద్దికాలం తర్వాత ఆమె అనూజ్ వేధింపులు తట్టుకోలేక అతడి నుంచి విడిపోయింది. నాలుగేళ్ల తర్వాత అనూజ్ మూడో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మూడో భార్యకు తెలియకుండా ఆమె బంధువును 4వ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అనూజ్ నిజస్వరూపం తెలియడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో 2019లో అనూజ్ ఐదోసారి వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయన భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అతడికి గతంలోనే నాలుగు సార్లు వివాహం అయినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఐదో భార్య అనూజ్ నుంచి వేరుగా ఉంటుంది.

కాగా, కొద్ది రోజుల క్రితం అనూజ్ ఆరవసారి పెళ్లికి సిద్ధమయ్యాడు ఈ విషయం కాస్త అతడి ఐదో భార్యకు తెలిసింది. వెంటనే కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అనూజ్ ని అరెస్టు చేశారు.దర్యాప్తులో అనూజ్ మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా తాను వీరందరిని మోసం చేశానని తెలిపాడు. లక్కీ పాండే గా పేరు మార్చుకుని.. తప్పుడు అడ్రస్ లు ఇస్తూ... మహిళలను మోసం చేసే వాడినని వెల్లడించాడు. తనను తాను ప్రభుత్వ ఉద్యోగి, క్లర్క్, టీచర్, తంత్రగాడిగా పరిచయం చేసుకుని బాధితులను ఏమార్చి, వారిని వివాహం చేసుకునే వాడినని తెలిపాడు. అలానే సమస్యలతో తన ఆశ్రమానికి వచ్చే మహిళలను ట్రాప్ చేసి లొంగదీసుకునే వాడినని పోలీసుల దర్యాప్తులో అనూజ్ వెల్లడించాడు.