రాజస్థాన్ లో కొత్త జంటకు అవమానం జరిగింది. వివాహ కార్యక్రమం అయిపోయిన తరువాత గుడిలోకి వెళ్లి కొబ్బరికాయ కొట్టాలని భావించిన ఆ జంటను అక్కడి పూజరి అడ్డుకున్నాడు. ఆ గ్రామస్తులు కూడా పూజరి మాటకే మద్దతు ఇచ్చారు. 

మ‌నుష‌లంద‌రూ స‌మాన‌మే, ఎవ‌రినీ వివ‌క్ష‌తో చూడ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నా ప్ర‌తీ రోజూ ఎక్క‌డో ఓ చోట కుల వివ‌క్షకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా రాజ‌స్థాన్ లో ఇలాంటి వివ‌క్ష ఒక‌టి జ‌రిగింది. ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన ఓ న‌వ దంపతుల‌ను పూజారి గుడిలోకి రానివ్వలేదు. 

రాజ‌స్థాన్ లోని జలోర్ జిల్లాలోని అహోర్ సబ్‌డివిజన్ పరిధిలోని నీలకంఠ గ్రామంలో శ‌నివారం జ‌రిగిందీ ఘ‌ట‌న‌. ఆ గ్రామంలో కొత్త‌గా పెళ్లయిన వేలా భారతి దంపతులు స్థానిక ఆల‌యంలోకి వెళ్లి పూజ‌లు నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. అయితే ఆ జంట ద‌ళిత సామాజిక‌వ‌ర్గానికి చెందినది కావ‌డంతో ఆ ఆలయంలోకి అడుగుపెట్ట‌కూడ‌ద‌ని అక్క‌డి పూజారిని అడ్డుచెప్పాడు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీనిపై బాధిత కుటుంబం పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. దీంతో పోలీసులు ఆ పూజారిపై ఎస్సీ,ఎస్టీ (అత్యాచారాల నిరోధక) అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టారు. నిందితుడిని అరెస్ట్ చేశామ‌ని జాలోర్ పోలీసు సూపరింటెండెంట్ హర్షవర్ధన్ అగర్వాలా ఆదివారం తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై బాధితులు మాట్లాడుతూ.. వివాహం జ‌రిగిన త‌రువాత తాము ఆల‌యంలో కొబ్బ‌రికాయ కొట్టేందుకు వెళ్లాల‌ని అనుకున్నామ‌ని తెలిపారు. అయితే గేటు ద‌గ్గ‌రికి చేరుకోగానే మమ్మల్ని పూజారి ఆపాడు. కొబ్బ‌రికాయ‌ను బ‌య‌టే పెట్టాల‌ని సూచించాడ‌ని అన్నారు. తాము దళితులం కాబట్టి గుడిలోకి రావొద్ద‌ని చెప్పాడని తెలిపారు. 

ఈ విష‌యంలో కొంతమంది గ్రామస్తులు కూడా పూజారికి మద్దతు ఇచ్చారని ఆ జంట ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇది గ్రామ నిర్ణయమని, పూజారితో వాదించడం వల్ల ప్రయోజనం లేదని గ్రామ‌స్తులు చెప్పార‌ని అన్నారు. ‘‘ మేము పూజారిని చాలా వేడుకున్నాము. కానీ అతను మొండిగా ఉన్నాడు. ఆ తర్వాత మేము పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేసాము ’’ అని బాధితులు చెప్పారు.