కరోనా మహమ్మారితో ప్రపంచమంతా పోరాడుతోందన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించారు.

కోవిడ్ పేషెంట్స్‌కు సేవలందిస్తున్నయోధులకు దేశం రుణపడి వుంటుందని.. కరోనా ప్రభావంతో ప్రజల జీవన స్థితిగతులే మారిపోయాయని రాష్ట్రపతి అన్నారు. కోవిడ్ వేళ అనేక పథకాల ద్వారా ప్రజలకు కేంద్రం సాయం చేసిందని ఆయన గుర్తుచేశారు.

వందే భారత్ మిషన్ ద్వారా 10 లక్షల మంది భారత్‌కు చేరుకున్నారని రామ్‌నాథ్ అన్నారు. గల్వాన్‌లో అమరులైన మన సైనికులకు రాష్ట్రపతి సెల్యూట్ చేశారు. ప్రజారోగ్య వ్యవస్థను  బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని కోవింద్ స్పష్టం చేశారు.

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను కృతజ్ఞతతో గుర్తుంచుకుంటామని రామ్‌నాథ్ అన్నారు. మహనీయుల త్యాగం కారణంగా.. మనమందరం ఈరోజున స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని రాష్ట్రపతి అన్నారు.

జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్య్ర ఉద్యమానికి మార్గదర్శి కావడం మన అదృష్టమన్నారు. ఒక సాధువు, అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే రాజకీయ నాయకుడి మధ్య సమన్వయం భారతదేశంలో మాత్రమే సాధ్యమైందని రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాలు గతంలోలా జరగవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచమంతా ప్రాణాంతకమైన కరోనా వైరస్..  ప్రజల జీవితాలకు భారీ నష్టాన్ని కలిగించిందని రాష్ట్రపతి తెలిపారు.