ప్రసవ వేదనతో హాస్పిటల్‌కు వచ్చిన మహిళను భోజనం సమయంలో జాయిన్ చేసుకోమని చెప్పడంతో.. ఆ గర్భిణీ నడిరోడ్డుపైనే ప్రసవించింది. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా చిత్రహళ్లికి చెందిన చౌడప్ప భార్య గంగమలమ్మకు పురిటీ నొప్పులు రావడంతో సోమవారం గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాడు.

అయితే వారు వెళ్లిన సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్, నర్స్ దంపతులను వెయిట్ చేయమని చెప్పారు. 11 గంటలకు వీరు హాస్పటిల్‌కు వెళితే.. మధ్యాహ్నాం కావొస్తున్నా వైద్యుడి నుంచి పిలుపు రాకపోవడంతో చౌడప్ప ఆసుపత్రి సిబ్బందిని ఆరాతీశాడు.

దీంతో వారు ఇది భోజన విరామ సమయమని ఇప్పుడు జాయిన్ చేసుకోమని ఇంటికి వెళ్లిపోవాలని చెప్పారు. ఈ లోపు గంగామాలమ్మకి నోప్పులు ఎక్కువకావడంతో భరించలేకపోతోంది. దీనిని గమనించిన చుట్టుపక్కల మహిళలు ఆమెకు రోడ్డుపైనే పురుడు పోయాలని నిర్ణయించుకున్నారు.

కొందరు గంగమాలమ్మ చుట్టూ నిలబడి.. చీరలను తెరగా చేశారు. దీంతో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రద్దీగా ఉండే రహదారిపై ఈ తతంగం నడవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు వైద్యుల నిర్లక్ష్యంపై చౌడప్ప జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ఆయన బాధ్యులపై విచారణకు ఆదేశించారు.