ప్రయాగరాజ్ మహా కుంభమేళా వెలిగిపోనుంది... కరెంటు లేకపోయినా!!
ప్రయాగరాజ్ మహా కుంభమేళా రాత్రి కరెంటు పోయినా పరవాలేదు...చీకట్లో వుండాల్సిన అవసరం లేదు. అందుకు తగినట్లుగా యోగి సర్కార్ సరికొత్త ఏర్పాట్లు చేసింది.
ప్రయాగరాజ్ : ఈసారి ప్రయాగరాజ్ మహా కుంభమేళాను మరింత వైభవంగా నిర్వహించేందుకు యోగి సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే కారు చీకట్లోనూ వెలుగులు పంచేందుకు సిద్దమయ్యారు. రాాత్రి వేళ మేళా ప్రాంతంలో మెరిసే వెలుగులు గంగా, యమునా నదుల ప్రవాహాన్ని మరింత అందంగా మారుస్తాయి. ఈ అద్భుత దృశ్యాన్ని భక్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేలా యోగి ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది.
మొదటిసారిగా మొత్తం మేళా ప్రాంతాన్ని 24x7 వెలుగులతో నింపేందుకు 40 వేలకు పైగా రీఛార్జబుల్ లైట్లను (రీఛార్జబుల్ బల్బులు) వాడనున్నారు. ఈ బల్బులు వాటంతట అవే రీఛార్జ్ అవుతాయి... కరెంటు పోయినా వెలుగునిస్తాయి. ఏవయినా కారణాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా ఈ బల్బులు వెలుగుతూనే ఉంటాయి. మహా కుంభమేళాలో మాత్రమే కాదు ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి లైట్లను ఇంత పెద్ద కార్యక్రమంలో వాడటం ఇదే తొలిసారి.
మహా కుంభమేళాలో చీకటే ఉండదు
మేళా ప్రాంతంలో విద్యుత్ శాఖ ఇంచార్జ్ అధికారి అనుప్ కుమార్ సిన్హా మాట్లాడుతూ... క్యాంపులకు ఇచ్చే విద్యుత్ కనెక్షన్లలో సాధారణ ఎల్‌ఈడీ బల్బులతో పాటు రీఛార్జబుల్ బల్బులను కూడా వాడాలని నిర్ణయించామని చెప్పారు. ఈసారి మొత్తం మేళా ప్రాంతంలో నాలుగున్నర లక్షల కనెక్షన్లు ఇవ్వాలి... దానిలో 1/10 వంతు అంటే 40 నుంచి 45 వేల వరకు రీఛార్జబుల్ బల్బులు కూడా ఉంటాయి. రీఛార్జబుల్ బల్బుల్లో ఇన్‌బిల్ట్ బ్యాటరీ ఉంటుంది, లైట్ వెలుగుతున్నప్పుడు అది ఛార్జ్ అవుతూనే ఉంటుంది. కరెంటు పోతే ఈ బ్యాటరీ బల్బును వెలిగిస్తూ ఉంటుంది.
ఒక క్యాంపులో 5-6 బల్బులు ఉండి, కరెంటు పోతే ఒక్క రీఛార్జబుల్ బల్బు వెలిగినా చీకటి ఉండదు. బ్యాకప్ లైట్ల ఏర్పాటు కూడా ఉంది, జనరేటర్ల వాడకం ఉంటుంది, ఒకటి రెండు నిమిషాల్లో కరెంటును పునరుద్ధరిస్తాం. కానీ ఈ ఒకటి రెండు నిమిషాల్లో కూడా చీకటి పడకుండా చూస్తామని అనుప్ కుమార్ సిన్హా తెలిపారు.
మహా కుంభమేళాాలో తొలిసారి
ఈ రీఛార్జబుల్ లైట్లను సాధారణ బల్బులతో పాటు అమరుస్తామని మేళా ప్రాంతంలో విద్యుత్ శాఖ ఇంచార్జ్ చెప్పారు. సాధారణ బల్బుల మాదిరిగానే వీటి వెలుగు కూడా ఉంటుంది. కరెంటు పోతే మిగతా బల్బులు ఆరిపోతాయి... కానీ ఈ బల్బు వెలుగుతూనే ఉంటుందన్నారు. మహా కుంభమేళా ప్రాంతంలో విద్యుత్ శాఖ చేపడుతున్న ప్రాజెక్టుల నుంచే ఈ బల్బులకు నిధులు సమకూరుస్తారు. ఒక రీఛార్జబుల్ బల్బు ధర సుమారు 600 నుంచి 700 రూపాయల మధ్య ఉంటుంది. 45 వేల బల్బులు అమర్చడానికి సుమారు 2.7 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. అయితే క్యాంపుల సంఖ్యను బట్టి బల్బుల సంఖ్య మారవచ్చు.
రీఛార్జబుల్ బల్బు కాన్సెప్ట్ ఒకటి రెండు సంవత్సరాల క్రితమే వచ్చిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ పెద్ద మేళాలోనూ, పెద్ద కార్యక్రమంలోనూ దీన్ని వాడలేదు. మహా కుంభమేళాలోనే తొలిసారి వాడుతున్నట్లు అనుప్ కుమార్ సిన్హా తెలిపారు.
2 వేల సోలార్ హైబ్రిడ్ లైట్లు కూడా
క్యాంపుల్లోనే కాదు బయట కూడా కరెంటు పోతే చీకటి పడకుండా చూస్తున్నాం... ఇందుకోసమే క్యాంపుల బయట 67 వేల సాధారణ లైట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాటి బ్యాకప్‌గా 2 వేల సోలార్ హైబ్రిడ్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరెంటు పోయినా సోలార్ హైబ్రిడ్ లైట్లు వెలుగుతూనే ఉంటాయి... వీటిలోనూ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది... అది సూర్య కిరణాలతో ఛార్జ్ అవుతుందన్నారు. కరెంటు పోతే ఈ బ్యాటరీ ద్వారా వెలుగు వస్తుంది. ఈ రెండు వేల సోలార్ హైబ్రిడ్ లైట్లు కూడా మేళా ప్రాంతంలో చీకటి పడకుండా చూస్తాయని అనుప్ కుమార్ సిన్హా వెల్లడించారు.