న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో దాదాగా పేర్గాంచిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసీ పనితీరు భేష్ అటూ ప్రశంసలు కురిపించిన గంటల వ్యవధిలోనే ఆయన వెంటనే పలు కీలక ఆరోపణలు చేశారు. 

ఈవీంలపై వస్తున్న ఆరోపణలు తనను ఆందోళనకు గురి చేస్తున్నాయంటూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈవీఎంల ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా పవిత్రమైందన్న ఆయన ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. 

ఓటర్ల తీర్పును ట్యాంపరింగ్‌ చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై తాను ఆందోళన చెందినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈవీఎంల రక్షణ, భద్రత బాధ్యత ఎన్నికల సంఘమే వహించాలన్నారు. ప్రజాస్వామ్య మూలాలను సవాలు చేసేలా వార్తలు రావడం సరికాదన్నారు. 

ప్రజల తీర్పు చాలా ఉన్నతమైనదంటూ చెప్పుకొచ్చారు. అన్ని అనుమానాలకు అతీతంగా ఆ తీర్పును ఉంచాలని కోరారు. మన వ్యవస్థలపై దృఢమైన విశ్వాసం ఉన్న వ్యక్తిని అంటూ చెప్పుకొచ్చారు. మన వ్యవస్థల సమగ్రత బాధ్యత ఎన్నికల సంఘంపై ఆధారపడి ఉందన్నారు. 

ఎలాంటి ఊహాగానాలు లేకుండా చేయాల్సి ఉంటుందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, పంజాబ్‌, హర్యాణాలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై పలు వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌ రూంల వద్ద కొందరు ఆందోళనకు దిగారు. 

అయితే ఈ వార్తలు వదంతులేనని ఈసీ స్పష్టం చేస్తున్నప్పటికీ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఈవీఎంట ట్యాంపరింగ్ లపై ఇప్పటికే విపక్షాలు పోరాటబాట పట్టాయి కూడా. ప్రజలు ఈవీఎంల ద్వారా తమ తీర్పును తెలియజేస్తే బీజేపీ మాత్రం ట్యాంపరింగ్ కు పాల్పుడుతూ అధికారంలోకి రావాలని చూస్తోందని విపక్షాలు ఆరోపించాయి.